తెలుగు సినిమా రంగం గర్వించదగ్గ మ్యూజిక్ డైరెక్టర్లలో కోటి కూడా ఒకరు. రెండున్నర దశాబ్దాల క్రితం రాజ్ కోటి అన్న వాళ్లు ఫేమస్. వీరిద్దరు కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. ఆ తర్వాత రాజ్ నుంచి కోటి విడిపోయి కోటిగా ఎన్నో హిట్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చారు. కోటి అసలు పేరు సాలూరి కోటేశ్వరరావు. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి దగ్గర సంగీతం నేర్చుకున్న కోటి దగ్గర మణిశర్మ, ఏఆర్. రెహ్మన్ శిష్యరికం చేయడం గమనార్హం.
అప్పట్లో రాజ్‌కోటి సీతారత్నం గారి అబ్బాయితో పాటు హలో బ్రదర్ లాంటి సినిమాలకు ఇచ్చిన ఆల్బమ్స్ ఓ ట్రెండ్ సెట్ చేశాయి. హలోబ్రదర్ సినిమాకు కోటికి నంది అవార్డు వచ్చింది. ఇక ఆయన తన తాజా ఇంటర్వ్యూలో లవ్ గురించి మాట్లాడారు. తనకు లవ్ చేసే టైం ఉండేది కాదని.. అయితే అప్పట్లో తాను ఓ అమ్మాయిని ఇష్టపడ్డానని.. అదే తన ఫస్ట్ లవ్ అని చెప్పారు. ఇక తనకు పెళ్లి అయ్యాక కెరీర్ పుంజుకుందని చెప్పిన కోటి తనకు ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు.
ఇక ప్రముఖ దర్శకుడు కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య హీరోగా తెరకెక్కిన ఓ సినిమా రైట్స్‌ను కోటి తీసుకున్నారట. అయితే ఆ పెట్టుబడి నుంచి రూపాయి కూడా వెనక్కు రాలేదట. రెండో రోజు నుంచే సినిమా తుస్సు మనడంతో తాను నష్టపోయానని కోటి వాపోయారు. ఆ తర్వాత మళ్లీ తాను డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి రాలేదని చెప్పారు.
ఆ తర్వాత సైడ్ బిజినెస్‌ల్లోకి ఎంట్రీ ఇస్తే అవి కూడా కలిసి రాలేదని.. ఒకప్పుడు చెన్నైలో తనకు సొంతంగా స్టూడియో కూడా ఉండేదని కోటి చెప్పారు.