రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరు మాట్లాడుకునే అంశం ఒక్కటే. అదే మా ఎన్నికలు. కేవలం సినిమా వాళ్లే మాత్రమే కాకుండా.. అటు రాజకీయ నాయకులు.. రెండు తెలుగు రాష్ట్రాల జనాలు ఎంతో ఆసక్తితో వెయిట్ చేస్తోన్న మా ఎన్నికలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభ మయ్యాయి. ఫిల్మ్ నగర్ లోని జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్లో మూడు గదుల్లో మా ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ లో ఇప్పటికే పలువురు ప్రముఖులు ఓట్లేశారు.
ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన కొద్దిసేపట్లోనే..పోలింగ్ కేంద్రానికి సినీ ప్రముఖులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే పలువురు సినీ తారలు ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, రామ్ చరణ్, సాయి కుమార్ తదితరులు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా.. ఇప్పటివరకు దాదాపు 150 ఓట్లు పడినట్లుగా తెలుస్తోంది.
ఓటు వేసిన అనంతరం చిరంజీవి మిడీయాతో మాట్లాడుతూ..మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న ఆయన.. ఒక్కోసారి మారుతోన్న పరిస్థితులకు అనుగుణంగా సమాయత్తం కావాల్సి ఉంటుంది అంటూ.. మీ మీడియాకు మంచి మెటిరియల్ దొరికింది కదా అని చమత్కరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..ఎక్కువ శాతం కళాకారులు ఎవరిని ఎన్నుకుంటే వారికే నా మద్ధతు అని చెప్పుకొచ్చారు. ఇక మా ఎన్నికలలలో ముందు నుంచి మెగా స్టార్ తో పాటు ఆయన ఫ్యామిలీ అంతా ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మా ఎన్నికల నేపథ్యంలో ఇంత పెద్ద యుద్ధం జరుగుతున్నా ఇప్పటి వరకు ఎవ్వరూ దీనిపై స్పందించ లేదు.