మెగాస్టార్ తమ్ముడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. తక్కువ టైంలోనే పవన్ కాస్తా పవర్ స్టార్‌గా ఎదిగాడు. ఎవ్వరూ ఊహించని విధంగా తర్వాత రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజు జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మించారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించగా… అక్కినేని మనవరాలు సుప్రియ ఈ సినిమాతో హీరోయిన్ అయ్యింది.
ఈ సినిమా కోసం అరవింద్ పవన్‌కు రెమ్యునరేషన్‌గా అప్పట్లో నెలకు రు. 5 వేలు ఇచ్చేవారట. ఆ తర్వాత పవన్ తమ్ముడు, సుస్వాగతం, బద్రి, ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లతో స్టార్ హీరోగా ఉన్నాడు. ఆ టైంలో మళ్లీ 2003లో అదే గీతా ఆర్ట్స్ బ్యానర్లో పవన్ స్వీయ దర్శకత్వంలో జానీ సినిమా వచ్చింది. రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా డిజాస్టర్ కావడతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వచ్చాయి.
అయితే ఈ సినిమాకు పవన్ తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కు ఇవ్వడతో పాటు నిర్మాత అరవింద్‌ను సైతం కొంత అమౌంట్ వెనక్కు ఇవ్వాలని పవన్ కోరాడట. అయితే సినిమా ప్లాప్ అయితే నష్టాలు రావడం కామన్ అని.. దీనికి మళ్లీ మనం డబ్బులు వెనక్కు ఇవ్వాల్సిన అవసరం లేదని అరవింద్ చెప్పాడని అప్పట్లో ప్రచారం జరిగింది. పవన్ తన రెమ్యునరేషన్ వెనక్కు ఇవ్వడంతో పాటు మరో రు. 15 లక్షలు అప్పు చేసి మరీ అప్పట్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయిన దాంట్లో కొంత వెనక్కు ఇచ్చాడు.
ఆ సినిమా టైంలోనే అరవింద్‌కు, పవన్‌కు మధ్య గ్యాప్ ఏర్పడిందని. తర్వాత అది క్రమక్రమంగా పెరిగిందని అంటారు. అయితే తర్వాత పవన్ అదే గీతా ఆర్ట్స్‌లో జల్సా సినిమా చేశాడు. అయితే అది చిరు మధ్యవర్తిత్వం ద్వారానే జరిగిందంటారు. 2009 ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ సినిమా చేశారు. ఆ తర్వాత చాలా రోజులు అరవింద్ – పవన్ మధ్య పెద్దగా సఖ్యత లేదట. అయితే శ్రీరెడ్డి పవన్‌పై తీవ్ర విమర్శలు చేయడంతో అరవింద్ ప్రెస్‌మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు. ఇక ఇటీవల మళ్లీ వీరి మధ్య సంబంధాలు కాస్త మెరుగయ్యాయన్న టాక్ ఇండస్ట్రీలో ఉంది.