తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ( మా ) తెలంగాణలో హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలను మించి రసవత్తరంగా జరుగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన జరుగుతున్న ఎన్నికలలో అటు ప్రకాష్‌రాజ్ ఫ్యానెల్, ఇటు మంచు విష్ణు ఫ్యానెల్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ ప్రచార పర్వంలో విమర్శలు హద్దులు దాటేసి చివరకు వ్యక్తిగతంగా విమర్శించుకునే వరకు వెళ్లింది.
ప్రకాష్‌రాజ్ ముందుగా హద్దుమీరి మాటలు వదిలేశారని అంటున్నారు. ఇదే ఆయనకు సీనియర్లలో మైనస్ అవుతోంది. విష్ణు ముందు నుంచి సంయమనంతోనే వ్యవహరిస్తూ వచ్చారు. పైగా సీనియర్లు, గౌరవం అన్న మాటలు ఆయన తరచూ ఉపయోగించారు. దీంతో సీనియర్ ఫ్యామిలీలు, వారి కుటుంబ సభ్యుల్లో మాత్రం విష్ణుకే మొగ్గు కనపడుతోంది.
ఇక నిన్నటికి నిన్న రవిబాబు కూడా బయటకు వచ్చి మా ను నడిపేందుకు ఇక్కడ వాడు కాకుండా ఎక్కడ నుంచో వచ్చిన వాడికి సపోర్ట్ చేస్తామా ? అని ప్రశ్నించారు. దీనికి తోడు ప్రకాష్‌రాజ్ చేసిన వ్యాఖ్యలు సైతం ఆయనకు వ్యతిరేకంగా మారాయి. జగన్ నీ బావ అయితే జగన్ వచ్చి ఇక్కడ ఓటు వేస్తాడా ? అంటూ ప్రకాష్ చేసిన మాటలు వైసీపీ వాళ్లకు కోపాన్ని తెప్పిస్తున్నాయి.
దీంతో వైసీపీ సానుభూతిపరులు అందరూ విష్ణుకే సపోర్ట్ చేస్తున్నారు. ఇక మోహన్‌బాబు తెరవెనక తన పలుకుబడి అంతా ఉపయోగించి మరీ చక్రం తిప్పుతున్నారు. ఇక మెగా ఫ్యామిలీ ప్రకాష్‌రాజ్‌ను ముందుకు నెట్టినా ఆ స్థాయిలో సపోర్ట్ చేయడం లేదనే అంటున్నారు. సాయితేజ్ యాక్సిడెంట్‌తో ఆ ఫ్యామిలీ ఇబ్బందుల్లో ఉంది.
ఎట్టకేలకు నిన్నటికి నిన్న నాగబాబు బయటకు వచ్చినా.. నాగబాబు వల్ల పెద్దగా ఒరిగేదేమి ఉండదు. ఇక సినీ పెద్దల సపోర్ట్ లేకుండానే గెలుస్తాను అని ప్రకాష్ అన్న మాటలు కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మారాయి. మరి ఇవి ఎలా ఉన్నా మా కొత్త అధ్యక్షుడు ఎవరో ఈ నెల 10న తేలిపోనుంది.