అందాల తార, దివంగత హీరోయిన్ దివ్యభారతి గురించి పరిచయాలు అవసరం లేదు. `బొబ్బిలి రాజా` సినిమాతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ ఉత్తరాది భామ.. అతి తక్కువ సమయంలోనే ఇటు టాలీవుడ్‌లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ స్టార్‌డమ్‌ను దక్కించుకుంది. అయితే ఆ స్టార్‌డమ్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయి.. కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.
కేవలం 19 ఏళ్లకే ఆమె అపార్ట్ మెంట్ నుంచి కిందపడి మృతి చెందింది. దివ్యభారతి మరణంపై ఎన్నో అనుమానాలు, మరెన్నో కథనాలు వచ్చాయి. కానీ, ఇప్పటికీ ఆమె మరణం వెనకున్న కారణం మిస్టరీనే. అయితే చాలా మంది మాత్రం దివ్యభారత మరణానికి ఆమె భర్తే కారణం అని అంటుంటారు. బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ సాజిద్ నడియాద్ వాలాను దివ్య భారతి ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఓ హిందీ సినిమా షూటింగ్ సమయంలో సాజిద్, దివ్యభారతిల పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారగా.. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ, వీరిద్దరి మతాలు వేరు కావడంతో.. సాజిద్ కోరిక మేరకు హిందూ అయిన దివ్య ఇస్లాం మతం స్వీకరించింది. అంతేకాదు దివ్యభారతి పేరు కూడా మార్చుకుంది. చివరకు ఈ ప్రేమికులు 1992 సంవత్సరంలో రహస్యంగా పెళ్లి చేసుకుని భార్యాభర్తలయ్యారు.
అయితే వీరి దాంపత్య జీవితం ఎక్కువ కాలం నిలవలేదు. పెళ్లైన 11 నెలలకే ముంబైలోని అంధేరి వెస్ట్, వెర్సోవాలోని తులసి బిల్డింగ్స్‌లోని ఐదో అంతస్తు నుంచి కింద పడి మరణించింది. ఇక ఆ సమయంలో ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా, ఆమె భర్త సాజిద్ అక్కడే ఉన్నారు. దాంతో ఆమె మరణానికి సాజిద్‌నే కారణమంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ, ఇది ఎంత వరకు నిజమో ఇప్పటికీ తెలియదు.