Balayya made interesting comments on movies collections in a event which is held by T Subbi Ramireddy.
సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ప్రతిష్టాత్మక వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కలెక్షన్ల గురించి యూనిట్ గానీ, డైరెక్టర్ క్రిష్ గానీ మాట్లాడలేదు. ఈ చిత్రం ఇప్పటికే రూ.50 కోట్ల (షేర్)పైనే కలెక్ట్ చేసిందని, బాలయ్య కెరీర్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి కానీ.. ఆ సంగతులేవీ ‘శాతకర్ణి’ టీం అధికారికంగా వెల్లడించలేదు. మరోవైపు.. ఈ సినిమాకి పోటీగా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్ల విషయంలో స్వయంగా చిత్రబృందమే అఫీషియల్ అప్డేట్స్ ఇస్తోంది. ‘శతమానం భవతి’ మూవీ వసూళ్ల వివరాలు కూడా ఆ చిత్రటీం నుంచి వస్తున్నాయి. కానీ.. ‘శాతకర్ణి’ యూనిట్ మాత్రం మౌనంగానే ఉంది. అయితే.. బాలయ్య మాత్రం కలెక్షన్ల గురించి అదిరిపోయే కామెంట్స్ చేశారు.
టి.సుబ్బిరామిరెడ్డి శాతకర్ణి టీంను సత్కరించిన సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో ఏది ఎక్కువ కలెక్షన్లు సాధించిందో అందరికీ తెలుసు. ఐతే మాకు నంబర్లతో పట్టింపు లేదు. నా సినిమాల్ని ఎక్కడ పెట్టాలో.. వాటి స్థానమేంటో నా ఫ్యాన్స్‌కు తెలుసు. అవన్నీ వాళ్లు చూసుకుంటారు. వాళ్లే నాకు అన్నీ’ అని బాలయ్య వ్యాఖ్యానించారు. అయితే.. ఈ కామెంట్స్‌పై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయం వెల్లడిస్తున్నారు. కలెక్షన్ల కంటే కంటెంట్ గొప్పందని బాలయ్య చెప్పదలచుకున్నారని కొందరు అంటుంటే.. నిజాయితీగా ‘ఖైదీ నెంబర్ 150’ కలెక్షన్లే ఎక్కువ అని ఆయన ఒప్పుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా.. కలెక్షన్లపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.