ఏ మైలురాయికైనా మొదలంటూ ఉండాలి. తెలుగు సినిమా ప్రభంజనంలో అటువంటి తొలి మైలురాళ్ళు అనేకం. తొలి తెలుగు చిత్రం దగ్గరనుంచి మొదలు పెట్టి నేటి వరకు పరిశీలిస్తే ఏన్నో విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. టాలీవుడ్ లో అప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన చిత్రాలు చూసి చూసి బోర్ కొడుతున్న ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ గా ఉండే విధంగా..ఫ్యాక్షన్ చిత్రాలవైపు మొగ్గు చూపారు దర్శక, నిర్మాతలు. భిన్నమైన కథాంశంతో వచ్చిన ఏ సినిమా అయినా చూడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో ఫ్యాక్షన్ సినిమాలు రావడంతో అవి కొత్తగా అనిపించి వాటిని తెలుగు ప్రేక్షకులు చూడడం ప్రారంభించారు. బాగా ఆదరించారు. దీంతో అప్పట్లో వచ్చిన ఫ్యాక్షన్ సినిమాలు అన్నీ బాక్స్ ఆఫిస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి.
అలా ఫ్యాక్షన్ నేపద్యంలో వచ్చిన ప్రేమించుకుందాం రా, సీతారామరాజు, సమరసింహా రెడ్డి, అంతపురం, ఇంద్ర, ఆది, నరసింహ నాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమ సింహం, దమ్ము, మిర్చి, అరవింద సమేత వీర రాఘవ లాంటి సినిమాలన్నీ దాదాపు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. నిర్మాతలకు ఈ సినిమాలతో కనకవర్షం కురిసింది. టాప్ స్టార్స్ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఒక్క సినిమా అయినా చేయాలని కథా రచయితలను కోరే పరిస్థితి కూడా వచ్చింది.
వెంకటేష్ కెరీర్లోనే సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ప్రేమించుకుందాం.. రా సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. జయంత్. సి. పరాన్జీ ఈ సినిమాతో టాలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అంతేకాదు ఈ సినిమాతో అంజలా ఝవేరి హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అయింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై డి.సురేష్ బాబు నిర్మించారు. డి.రామానాయుడు సమర్పకుడిగా వ్యవహరించారు. ప్రేమించుకుందాం..రా సినిమా స్టోరీ విషయానికొస్తే.. మాములు ప్రేమకథకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కించి ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేసాడు దర్శకుడు జయంత్. సి.పరాన్జీ.
ఈ బ్లాక్ బస్టర్ సినిమాల కంటే ముందే తెలుగులో1990 ప్రథమార్థంలో రాయలసీమ ప్రాంత నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. 1991లో ఆర్.సి.క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ చలపతిరావు నిర్మాతలుగా కడప రెడ్డెమ్మ సినిమా వచ్చింది. రగులుతున్న రాయలసీమని ఈ చిత్రంలో సమర్థవంతంగా చూపించారు. ఈ చిత్రం కులద్వేషాలు పచ్చని బతుకుల్ని బూడిద చెయ్యడమే కాదు ఊరినే వల్లకాటిగా మార్చే వైనాన్ని ఎత్తిచూపి ఆలోచింపజేసేదిగా ముగుస్తుంది.
తమ ఉభయ కులాల మధ్య సయోధ్యలేదని తెలిసి కూడా రెడ్డి కులానికి చెండిన రాజశేఖర్ రెడ్డి (భరత్), నాయుళ్ళమ్మాయి మధు (మధుబాల) కాలేజీలో ప్రేమించుకుంటారు. సహజంగానే పెద్దలు ఒప్పుకోరు. కడప రెడ్డమ్మ (శారద) వాళ్ళను కలిపేందుకు దోహదపడి, ఆ ఊరి నుంచి బైటికి దాటించేస్తుంది. తరువాత వాళ్ళు పెళ్ళీ చేసుకుంటారు. మదు గర్భవతి అవుతుంది. మళ్ళీ ఆ ఊరొచ్చిన ఆ జంటని కుల పెద్దలు బలితీసుకుంటారు. ఆ పసికందును కూడా చంపాలనుకున్న పెద్దల్ని రెడ్డమ్మ హతమారుస్తుంది. ఇప్పటి ఫ్యాషన్ నేపధ్య సినిమాలకి మొదటగా కడప రెడ్డెమ్మ సినిమా పరుచూరి బ్రదర్స్ కలం నుంచి జాలువారిన చిత్రంగా పేర్కొనవచ్చు.