మా వార్ ముదురుతోన్న వేళ ప్రకాష్‌రాజ్ శిబిరం ప్రెస్‌మీట్ పెట్టిన మరుసటి రోజే నరేష్ క్యాంప్ కూడా ప్రెస్ మీట్ పెట్టి నాగబాబు, ప్రకాష్ రాజ్‌కు కౌంటర్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు మెగా క్యాంప్ చాలా తెలివిగా నరేష్ శిబిరాన్ని వీక్ చేస్తోన్న పరిస్థితే ఉంది. ముందుగా నరేష్ శిబిరం వైపునకు వెళ్లాలని అనుకున్న వారికి స్వయంగా మెగాస్టార్ ఫోన్ చేసి మరీ వాళ్లను ప్రకాష్ శిబిరం వైపు తిప్పేశారట. చివరకు నరేష్ ప్రెస్ మీట్ పెడితే కూడా పట్టుమని పది మంది కూడా లేరంటే నరేష్ శిబిరం వీక్ అయ్యిందనే అర్థమవుతోంది.
గతంలో నరేష్ మా అధ్యక్షుడు అయినప్పుడు కూడా మెగా క్యాంప్ మద్దతు ఉంది. మెగాస్టార్ మద్దతు ఉందంటే కనీసం 10 మంది హీరోల మద్దతు ఉన్నట్టే..! అందుకే గత ఎన్నికల్లో నరేష్ చాలా సులువుగా గెలిచారు. ఇక ఇప్పుడు నరేష్ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందే జీవిత రాజశేఖర్ ను ప్రెస్ మీట్ కు వస్తానని చెప్పి చివర్లో షాక్ ఇచ్చారట. దీని వెనక మెగా చక్రం తిరిగిందనే అంటున్నారు. పైగా ఆమె ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు.
మరోవైపు మోహన్‌బాబు, విష్ణు వరుసగా కృష్ణ, కృష్ణం రాజు ఇళ్లకు వెళ్లి కలుస్తున్నారు. మోహన్‌బాబు సీనియర్ కావడంతో ఆయన తన వంతుగా చక్రం తిప్పుతున్నారు. మరో వైపు హేమ కూడా పోటీలో ఉన్నానంటోంది. ఏదేమైనా మా ఎన్నికల వేడి మొదలైన వెంటనే క్రమక్రమంగా మెగా క్యాంప్ పట్టు సాధిస్తోన్న పరిస్థితి అయితే ఉంది.