ప్రస్తుతం ఏది కొనాలన్నా ఆన్లైన్ మార్కెట్ లోనే. మనం ఒంటరిగా ఉన్న లేదా ఇంట్లో వంట చేసుకునే ఓపిక లేకపోయినా వెంటనే గుర్తొచ్చేది ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేయడం. ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే ఇంటికే భోజనం వస్తుంది. పైగా రెస్టారెంట్ కంటే తక్కువ ధరకే ఫుడ్ లభిస్తుంది. ఎందుకంటే ఫుడ్ డెలివరీ చేసే కంపెనీలు ప్రతి ఆర్డర్ పై ఎదో ఒక ఆఫర్ ప్రకటిస్తూనే ఉంటుంది.
ఈ రంగంలో ఒకదానిని మించి మరో కంపెనీ ఆఫర్లు ప్రకటించి కస్టమర్లను ఊరిస్తుంటాయి. ఫుడ్‌పై ఆన్లైన్లో ఆఫర్లే.. ఆఫర్లు. జనం ఊరుకుంటారా.. టక్కున మొబైల్ తీసి ఒక్క ఆర్డర్ అలా విసిరేస్తారు. డెలివరీ బాయ్ ఓ గంటలో ఆర్డర్‌తో ఇంటి కాలింగ్ బెల్లు కొడతాడు. అలా ఆర్డర్ వచ్చిందో లేదో.. లొట్టలేసుకుంటూ తింటారు. ఇకపై ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నవాళ్లు జర జాగ్రత్త. ఎందుకు అంటారా? ఇది చదవండి మీకే తెలుస్తుంది.
దక్షిణాది సినీ నటి నివేదాపేతురాజ్. పాపం.. ఎంత ఆకలిగా ఉందో ఏమో.. నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసింది. డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ ఎంతో ఇష్టంగా తినడానికి ఓపెన్ చేయగా..ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడ్డారు. రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతేకాదండోయ్.. ఈ విషయాని అక్కడితో వదిలేయకుండా.. అందరికి తెలిసేలా.. అర్ధమయ్యేలా..రెస్టారెంట్‌ని ట్యాగ్ చేస్తూ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టారు. “ఇదొక ఉదాహరణ. నేను ఆర్డర్ చేసిన భోజనంలో బొద్దింక వచ్చిందని .. ఈ హోటల్ వాళ్లు సరిగ్గా నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని .. కొనుగోలుదారుల ఆరోగ్యంతో ఆడుకుంటున్న ఇలాంటి హోటళ్లపై భారీ జరిమానా విధించాలి” అని ఆమె అన్నారు. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు.