Megastar Chiranjeevi wishes director Krish for making visual wonder like Gautamiputra Satakarni.
గత ఇంటర్వ్యూల్లో చెప్పినట్లుగానే బాలయ్య వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు రాధాకృష్ణ జాగర్లమూడి (క్రిష్). ఇలాంటి భారీ సినిమా షూటింగ్‌ని కేవలం 79 రోజుల్లోనే పూర్తి చేసి అబ్బురపరిచిన క్రిష్.. అద్భుతమైన ఔట్‌పుట్‌ని వెండితెరపై చూపించి ఔరా అనిపించాడు. సత్తా ఉంటే అతి తక్కువ సమయంలోనే కేటాయించిన బడ్జెట్లో ఎలాంటి చిత్రాన్నైనా రూపొందించవచ్చునని చేసి చూపించాడు. ఇండస్ట్రీ మహామహులే ఖంగుతినేలా ‘శాతకర్ణి’ చిత్రాన్ని తెరకెక్కించాడు. దీంతో.. అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్, మహేష్‌బాబులు ‘ఈ చిత్రాన్ని ఇంత తక్కువ టైంలో ఎలా తీశావ్’ అంటూ క్రిష్‌ని ఆకాశానికెత్తేశారు. వీరితోపాటు సీనియర్ హీరోలైన నాగార్జున, వెంకటేష్‌లతోపాటు అల్లుఅర్జున్, నితిన్, రామ్, ఇతర యంగ్ హీరోలు ఈ సినిమా చూసి క్రిష్‌ని అభినందించారు. అలాగే.. దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు లాంటి దిగ్గజాలు కూడా క్రిష్ అండ్ కోపై ప్రశసంలు కురిపించారు. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనకు ఫోన్ చేసి అభినందించినట్లు క్రిష్ తెలిపాడు. ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించావని, ఔట్పుట్ అదిరిపోయిందని తనని చిరు అభినందించారని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిష్ చెప్పాడు.
ఇలా తనకు అన్నిచోట్ల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్న విషయంపై క్రిష్ స్పందిస్తూ.. ‘మా సినిమాకు ఇలాంటి స్పందన వస్తుందని అస్సలు ఊహించలేదు. ఒక ఫిల్మ్ మేకర్‌గా నేను ఇలాంటి అనుభవాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఈ సినిమా గురించి గొప్పగా స్పందించారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది’ అని క్రిష్ చెప్పుకొచ్చాడు. కాగా.. తన చిత్రం కూడా పోటీలో ఉన్నప్పటికీ చిరు క్రిష్‌కి ఫోన్ చేసి అభినందించడం నిజంగా విశేషం.