Nandamuri Balakrishna accepts a mistake in Gautamiputra Satakarni movie in his latest interview.
ఏ అంచనాలతో అయితే బాలయ్య ప్రతిష్టాత్మక వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిందో.. వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. విమర్శకులతోపాటు ఎందరో సెలబ్రిటీల ప్రశంసల అందుకుంటున్న ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. బాలయ్య మార్కెట్ వ్యాల్యూ కంటే ఎక్కువ వసూళ్లు రాబడుతోందంటే.. ఈ చిత్రం ఏ రేంజులో ఆడియెన్స్‌ని ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
అంతా బాగానే ఉంది కానీ.. ఒక్క విషయంలో మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో యుద్ధాలు తప్ప.. కథేమీ పెద్దగా లేదని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. శాతకర్ణి చేసిన యుద్ధాల వరుస క్రమాన్ని బాగానే చూపించారు కానీ.. ఆయన పాలన గురించి గానీ, వేరే కోణాల్ని గానీ సరిగ్గా చూపించలేదని విమర్శిస్తున్నారు. నిజానికి.. క్రిష్ తన గత చిత్రాల్లో కథను బలంగా చెప్పాడు.. ఎమోషన్ల మీద బాగా దృష్టి పెట్టాడు. కానీ.. ‘శాతకర్ణి’ లో మాత్రం అందులో ఫెయిల్ అయ్యాడని చెబుతున్నారు. ఈ విమర్శపై క్రిష్ ఇంతవరకు స్పందించలేదు కానీ.. బాలయ్య మాత్రం ఈ లోపాన్ని ఒప్పుకున్నాడు. ఈ చిత్రంలో గొప్ప కథేమీ లేదని తన తాజా ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పాడు.
‘గౌతమీపుత్ర శాతకర్ణిపై వినిపిస్తున్న విమర్శ వాస్తవమే. ఇందులో సరైన కథ లేదు.. అయినప్పటికీ ఉన్నంతలో ‘శాతకర్ణి’ గురించి గొప్పగా చెప్పే ప్రయత్నం చేశాం’ అని బాలయ్య అన్నాడు. ఇలా లోపాన్ని నిజాయితీగా ఒప్పుకున్న బాలయ్యకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.