కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలను వణికించిన గంధం చెక్కలు, ఏనుగు దంతాల బందిపోటు దొంగ వీరప్పన్ ఎంతో మంది పోలీసులు ప్రాణాలు తీసిన కరుడుగట్టిన నేరస్తుడు. వీరప్పన్ మరణం తర్వాత వర్మ వీరప్పన్‌పై ఓ సినిమా కూడా తీశాడు. ఇక వీరప్పన్ ఫ్యామిలీ గురించి చాలా ఆసక్తికర విషయాలే వెలుగులోకి వస్తున్నాయి. ఆయన కుమార్తె ప్రస్తుతం తమిళనాడు బీజేపీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తుండడంతో పాటు ఆమె నిరపేదల తరపున పోరాటం చేసే లాయర్‌గా పని చేస్తున్నారు.
వీరప్పన్ కుమార్తె విద్య బాల్యం, జీవితం చూస్తే కన్నీళ్లు ఆగవు. ఆమెకు మూడేళ్లు వచ్చే వరకు ఆమెకు తల్లి ఎలా ఉంటుందో తెలియదు. నాకు తెలిసీ తెలియని వయస్సులో ముక్కమొఖం తెలియని ఒకామెను చూపించి ఆమే మీ అమ్మ అని చెపితే ఎలా ఉంటుంది ? అప్పుడు నాకు బాధ, భయం రెండూ కలిగాయని ఆమె చెప్పింది. అప్పుడే నాకు పోలీసులే చాక్కెట్లు, బొమ్మలు కొని ఇచ్చారని… అప్పుడే తాను అమ్మ చేతితో గోరుముద్దలు తిన్నానని నాడు కావేరీ నదీ తీరంలో జరిగిన ఉదంతాన్ని గుర్తు చేసుకుంది.
ఇక తండ్రి ఎలా ఉంటాడో కూడా ఆమెకు తెలియదట. ఓ రోజు ఆమె ఆడుకుంటుంటే వెనక నుంచి ఓ వ్యక్తి వచ్చి పట్టుకోవడంతో తాను ఏడ్చిన విషయం గుర్తు చేసుకుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్లు అతడు మీ నాన్న అని చెప్పారని ఆమె చెప్పింది. చివరకు తాను ఏడుపు మానే వరకు ఎత్తుకున్న ఆయన నువ్వు డాక్టర్‌వి కావాలని చెప్పి వెళ్లిపోయారని.. ఆయన్ను చూడడం అదే మొదటి సారి.. చివరి సారి అని విద్య ఆవేదనతో చెప్పింది. ఇక తన తండ్రి కోరికకు భిన్నంగా తాను డాక్టర్ కాకుండా లాయర్ అయ్యానని చెప్పింది.
ఇక బెంగళూరు లా కాలేజ్‌లో చేరినప్పుడు చేతిలో చిల్లి గవ్వలేదని.. అయితే అప్పుడు నాలుగైదు స్కూళ్లలో కమ్యూనికేషన్ స్కిల్స్ పాఠాలు చెపుతూ ఆ సంపాదనతోనే తాను లా పూర్తి చేశానని ఆమె చెప్పారు. ఏదేమైనా ఓ పెద్ద గ్యాంగ్‌స్టర్ కుమార్తె జీవితం ఇలా ఉంటుందంటే ఆశ్చర్యం అనిపించకమానదు.