ప్రేమిస్తే సినిమా వచ్చి 12 ఏళ్లు అయ్యింది. ఆ సినిమా వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఇప్పటకి ప్రేక్షకులు మర్చిపోరు. ఆ సినిమాలో తమ నటనకు ప్రతి ఒక్కరు ప్రాణం పోశారు. పేద మెకానిక్‌తో ఓ ధనిక యువతి ప్రేమాయణం… ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని వెళ్లిపోవడం… వాళ్లిద్దరు వేరే ఊర్లో కలిసి బతుకుతుండగా.. చివరకు ఆ యువతి కుటుంబ సభ్యులు వారిని విడదీసి ఆమెకు మరో అబ్బాయితో పెళ్లి చేయడం.. చివరకు హీరో పిచ్చివాడు అవ్వడం లాంటి కథాంశంతో ప్రేమిస్తే తెరకెక్కింది.
కోలీవుడ్‌లో హిట్ అయిన ఈ సినిమాను దర్శకుడు మారుతితో కలిసి కొండేటి సురేష్ తెలుగులో రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతోనే హీరో భరత్ తెలుగులో కూడా మంచిపేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అతడు అడపా దడపా సినిమాలు చేసినా ఇప్పుడు కనిపించడం లేదు. మహేష్‌బాబు స్పైడర్ సినిమాలో కనిపించిన భరత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ? ఏం చేస్తున్నాడన్నది ఆరా తీస్తే అతడు హిందీ, మళయాళంలో బిజీ అయినట్టు తెలుస్తోంది.
2019లో సింబ-పొట్టు-కాళిదాస్ అనే మూడు తమిళ సినిమాల్లో నటించిన భరత్ ఈ యేడాది కూడా ఆరేడు సినిమాలకు ఓకే చెప్పాడు. అటు బాలీవుడ్లో కూడా పలు సినిమాలు చేస్తున్నాడు. స్టార్ హీరోగా రాణించలేకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టుగాను, సపోర్టింగ్ హీరోగాను భరత్ సత్తా చాటుతూనే ఉన్నాడు.