టాలీవుడ్లో ఓ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ అసిస్టెంట్ డైరెక్టర్ మృతి చెందాడు. ఇప్పటి వరకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉండి డైరెక్టర్ ఛాన్స్ వచ్చిన ఆ యువకుడు తన తొలి సినిమా షూటింగ్ చివర్లోనే దుర్మరణం పాలవ్వడంతో టాలీవుడ్లో పలువురిని కలచి వేసింది. డైరెక్టర్ సుధీర్‌వర్మ అసిస్టెంట్‌గా ఉన్న ప్రవీణ్ ఈ రోజు మృతి చెందారు.
ప్రవీణ్ రణరంగం తదితర సినిమాలకు సుధీర్ వర్మ దగ్గర పని చేశాడు. ఆహా ఓటీటీ డిజిటల్ ప్లాట్ ఫాంలో ఓ సినిమాకు డైరెక్టర్‌గా ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా దాదాపుగా ఫైనల్ అయ్యింది. షూటింగ్ చివరి దశకు చేరుకోగా కారు నడపాల్సిన సీన్ ఒకటి వచ్చింది. ముందుగా ఈ సీన్ కోసం తాను డ్రైవింగ్ చేసి చూపిస్తానని ప్రవీణ్ ముందుకు వచ్చాడు.
అయితే ప్రవీణ్ డ్రైవ్ చేస్తోన్న ఆ కారు ప్రమాదానికి గురి కావడంతో ప్రవీణ్ గాయాలపాలయ్యాడు. వారం రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి చివరకు మృతి చెందాడు. ఏదేమైనా జీవన పోరాటంలో డైరెక్టర్ అవ్వాలని కలలు కన్న ప్రవీణ్ ఆ కల చివర్లో ఉండగా మృతి చెందడం దురదృష్టకరం.