తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ బల్లి దుర్గప్రసాద్ కరోనాతో బుధవారం సాయంత్రం మృతి చెందారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనాతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు. ఇక బల్లి దుర్గాప్రసాద్ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆయన నెల్లూరు జిల్లా గూడూరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఇక ఆయన కరోనా నేపథ్యంలో తన నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయనకు కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చినా ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండడంతో మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. బీపీ, షుగర్ తో కూడా ఆయన బాధపడేవారని తెలుస్తోంది. ఇక 1985లో 28 ఏళ్లకే ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో ఓడినా 1994, 1999, 2009లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
1994లో గెలిచాక 1995లో ఆయన బాబు కేబినెట్లో విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. విద్యాశాఖా మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ఇక 2019లో ఆయన వైసీపీలో చేరి తిరుపతి ఎంపీగా లక్ష ఓట్ల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు.