గుంటూరులో తన కింద పనిచేసే మహిళా అధికారిణి ఓ ఉన్నతాధికారి వేధించడంతో ఆ మహిళా అధికారిణి చివరకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జిల్లాలోనే సంచలనంగా మారిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు సెబ్ సూపరింటెండెంట్ ఎన్.బాలకృష్ణన్ వేధింపులు భరించలేనంటూ ఎస్ఐ గీత ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏర్పాటు అయిన విచారణ బృదం గత రెండు రోజులుగా జిల్లాలో విచారణ జరుపుతోంది.
గీతతో పాటు బాలకృష్ణన్ చేతిలో వేధింపులకు గురవుతోన్న పలువురు సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది విచారణ అధికారుల ఎదుట ఆయన అరాచకాలు బయట పెట్టినట్టు సమాచారం. గీత విచారణ అధికారులతో మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా తాను ఎన్నో వేధింపులకు గురవుతున్నానని.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఎంతో టార్చర్ అనుభవిస్తున్నానని ఆమె తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
గుంటూరు టూటౌన్ సబ్స్టేషన్ ఇన్చార్జ్గా వచ్చినప్పుడు బాలకృష్ణన్ వేధింపులు తాళలేకపోయానని.. పెదకూరపాడుకు పోస్టింగ్ మార్పించుకున్నా కూడా తనను వదల్లేదని ఆమె వాపోయిందట. బయటకు చెప్పుకోలేని విధంగా… తనతో బాలకృష్ణన్ చాలా నీచంగా, అసభ్యంగా మాట్లాడేవాడని… ఆ భయంకరమైన టార్చర్ భరించలేకే తాను ఆత్మహత్యాయత్నం చేశానని తన మనోవేదన విచారణ అధికారులతో చెప్పుకుందని తెలుస్తోంది.