ఏపీలోని ప్రకాశం జిల్లాలో మంగళవారం రాత్రి భూప్రకంపనలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. మంగళవారం రాత్రి ఎవరికి వారు నిద్రకు ఉపక్రమించారు. అయితే రాత్రి 11.09 గంటల సమయంలో స్వల్ప భూకంపం సంభవించింది. దీంతో పడుకున్న వాళ్లకు వెంటనే ఉలిక్కిపడి మెలుకువ రావడంతో పాటు వారు ఒక్కసారిగా బయటకు వచ్చారు.
కనిగిరిలోని స్థానిక శివనగర్ కాలనీ, సాయిబాబా దేవస్థానం ప్రాంతాలతో పాటు మండలంలోని పేరంగుడిపల్లి గ్రామంలోనూ రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు వెల్లడించారు. ఆ తర్వాత మళ్లీ ఈ ప్రకంపనలు వస్తాయేమోనని చూసినా రాకపోవడంతో తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇక కనిగిరిలో గతంలో కూడా ఈ ప్రకంపనలు వచ్చాయి.