మరోసారి సీఎం జగన్‌కు ఇక్కట్లు వచ్చాయి. ఆయన చెప్పిన మేరకు వ్యవహరించే పరిస్థితి.. ఇచ్చిన మాటకు కట్టుబడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎట్టి పరిస్థితిలోనూ సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలను తిరిగి ప్రారంభించి తీరుతామని.. జగన్ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిపై ప్రతిపక్షాలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉందని, ఈ సమయంలో పాఠశాలలు తిరిగి తీస్తే.. ఇబ్బందులు వస్తాయని బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు, వామపక్షాలు కూడా సూచించాయి.
అయితే, జగన్ మాత్రం.. ముందుకు వెళ్లేందుకే డిసైడ్ అయిపోయాడు. ఒక ఏడాది విద్యాసంవత్సరం నాశనం అవుతుందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం సరైంది కాదని, కరోనా ఇప్పట్లో తగ్గుతుందనే సూచనలు కూడా కనిపించడం లేదని జగన్ పేర్కొన్నారు. దీంతో కేబినెట్ మంత్రులు సైతం జగన్ మాటకు ఎదురు చెప్పలేక పోయారు. ఈ క్రమంలోనే విద్యాశాఖ మంత్రి సురేశ్.. సెప్టెంబరు 5న పాఠశాలలు పునః ప్రారంభిస్తామని చెప్పారు. దీనికే కట్టుబడి పాఠశాలల ఉన్నతాధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే, ఇప్పుడు ఈ విషయంలో జగన్ వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజాగా కేంద్రం ప్రకటించిన అన్‌లాక్ 4.0లో పాఠశాలలను సెప్టెంబరు 30 వరకు మూసే ఉంచాలని సూచించింది. ఈ ప్రకటనతో జగన్ సర్కారు ముందుగా భావించినట్టు సెప్టెంబరు 5న పాఠశాలలు తిరిగి తెరిచే పరిస్థితి కనిపించడం లేదు. వాస్తవానికి పాఠశాల విద్య.. రాష్ట్ర పరిధిలోదే అయినప్పటికీ.. కరోనా నిబంధలు, కొవిడ్ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలను పర్యవేక్షిస్తోంది. ఈ నేపథ్యంలో కొవిడ్ ఆదేశాలను అన్ని రాష్ట్రాలూ పాటించాల్సిన అవసరం ఏర్పడింది.
దీంతో జగన్ తన పాఠశాల పునఃప్రారంభం నిర్ణయంపై మడమ తిప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే పేదలకు ఇళ్లు, జిల్లాల ఏర్పాటు, మూడు రాజధానులు.. వంటి అంశాలపైనా వెనుకడుగు కొనసాగుతూనే ఉండడం గమనార్హం.