జగన్ ప్రభుత్వంలో తొలి వికెట్ పడింది. ఏపీ ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న సీనియర్ పాత్రికేయుడు కొండుభట్ల రామచంద్రమూర్తి తన పదవికి రాజీనామా చేశారు. మూడు దశాబ్దాలకు పైగా ఆయన వివిధ పత్రికల్లో పనిచేస్తూ వచ్చారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్‌గా పనిచేసిన ఆయన ఎన్నికలకు ముందు సాక్షిలో పనిచేశారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రామచంద్రమూర్తికి ఏపీ ప్రభుత్వ సలహాదారుడు పదవి కట్టబెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే పలువురికి సలహాదారు పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే.
పాత్రికేయుడిగా మూడు దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన్ను పదవిలోకి తీసుకునేముందు ఎంతో గౌరవంగా చూశారు. ఎప్పుడు అయితే ఆయన పదవి చేపట్టారో అప్పటి నుంచి ఆయన్ను పట్టించుకునే వారే కరువయ్యారని ఆయన సన్నిహితుల వద్ద వాపోయిన పరిస్థితి ఉందట. కనీసం జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి ఉందని కూడా ఆయన పలుమార్లు మీడియా సర్కిల్స్‌లో వాపోయినట్టు కూడా వార్తలు వచ్చాయి.
ఇక ఆరు నెలల క్రితమే ఆయన రాజీనామా చేసేందుకు సీఎం జగన్ అపాయింట్మెంట్ కోరగా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వలేదనే ప్రచారం కూడా సాగింది. చివరికి వ్యక్తిగత కారణాలతోనే తాను తప్పుకుంటున్నట్లు రామచంద్రమూర్తి తన రాజీనామా లేఖలో పేర్కొనడం విశేషం.