Newsబాబుగారికి వరుస కష్టాలు..!!

బాబుగారికి వరుస కష్టాలు..!!

చంద్రబాబుకు మళ్లీ బ్యాడ్ టైమ్ మొదలైందా? పరిస్థితులు చూస్తూంటే అదే అన్పిస్తోంది. రాబోయే రోజులు చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవేమో అన్పిస్తోంది. ముఖ్యంగా ఓటుకు నోటు కేసు, కాపు రిజర్వేషన్లు బాబు గారి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ రెండు కాకుండా ఇంకొన్ని విషయాలు ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో ఉక్కిరి బిక్కిరి చేయొచ్చనిపిస్తోంది.

ముందు ఓటుకునోటు కేసు సంగతికి వద్దాం. ఈ కేసును తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టడంతో అంతా సర్దుమణిగింది. నిజానికి మొదట్లో చంద్రబాబుపై కేసీఆర్ దూకుడుగానే పోయినా.. బాబు కూడా చాకచక్యంతో ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 లాంటి విషయాలను రేజ్ చేసి విషయాన్ని సెట్ రైట్ చేసుకోగలిగారు. ఈ విషయంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుందనే టాక్ అప్పట్లోనే వినిపించింది. అయితే టైమ్ కోసం చూస్తున్న జగన్ మాత్రం ఈ విషయాన్ని వదిలిపెట్టలేదు. ఆర్టీఐ ద్వారా కేసుకు సంబంధించిన విషయాలు తీసుకుని పక్కా ఆధారాలతో.. తన ఎమ్మెల్యేతో ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయించాడు. జగన్ అనుకున్నట్లుగానే ఏసీబీ కోర్టులో బాబుకు చుక్కెదురైంది. మళ్లీ విచారణ జరపమని చెప్పడమే కాకుండా.. సెప్టెంబర్ 29లోపు నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. నివేదిక వచ్చిన తర్వాత అవసరమైతే పైకోర్టులకు వెళ్లి తాడోపేడో తేల్చుకునే ఆలోచనలో ఉన్నారు జగన్. అయితే ఏసీబీ కనుక బాబు దోషే అని నిర్ధారిస్తే చంద్రబాబుకు రాజకీయంగా ఇరకాటం తప్పదు.

ఇక తర్వాతి విషయం కాపు రిజర్వేషన్లు. ఇది ప్రస్తుతం చంద్రబాబు గుండెలపై కుంపటిలా ఉన్న వ్యవహారం. తానిచ్చిన డెడ్ లైన్ పూర్తవడంతో ముద్రగడ పద్మనాభం మళ్లీ కాపు నేతలందరిని కలుస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే దాసరి నారాయణరావును కలిశారు. సెప్టెంబర్ మొదటివారంలో అసెంబ్లీ సమావేశాలున్నాయి. ఇందులో కమిషన్ నివేదికను ఆమోదించి తీర్మానం చేయ్యకపోతే బాబుగారికి కష్టాలు తప్పవు. గతంలో ఉద్యమంలో విధ్వంసం జరగడంతో.. ఈసారి జరిగే ఉద్యమం ఎలా ఉండబోతుందనే ఆందోళన ప్రభుత్వవర్గాల్లో కనబడుతోంది. దీన్ని రాజకీయంగా పరిష్కరించేందుకు ప్రస్తుతానికైతే బాబు దగ్గర ఎలాంటి ప్లాన్స్ లేవు. అందుకే పవన్ కళ్యాణ్ ను తెరపైకి తెచ్చినట్లు అందరూ అనుకుంటున్నారు. పవన్ సెప్టెంబర్ 9న కాకినాడలో పెట్టే సభపైనే తెలుగు తమ్ముళ్ల ఆశలు.

మిగితావిషయాలు చూసుకుంటే స్విస్ చాలెంజ్ విషయం ఇప్పటికే హైకోర్టుకు చేరింది. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్టు సర్కార్ కు మొట్టికాయలు వేసింది. అటు అమరావతి రాజధాని నిర్మాణంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కేసు నడుస్తోంది. ఇందులో కూడా చంద్రబాబుకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరి రాబోయే రోజుల్లో వీటన్నింటిని బాబుగారు ఎలా నెట్టుకొస్తారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news