తనకు సంబంధం లేని విషయంలో యంగ్ హీరో రామ్ చేసిన ట్వీట్లే ఇప్పుడు అతడికి ఇండస్ట్రీలోనూ… అటు రాజకీయంగాను అతడికి శత్రువులను తెచ్చిపెట్టాయి. తన బంధువు అయిన విజయవాడ రమేష్ హాస్పటల్స్ అధినేత రమేష్‌కు మద్దతుగా రామ్ ఓ ట్వీట్ చేశాడు. వాస్తవంగా రమేష్ హాస్పటల్‌కు అనుబంధంగా నడుస్తోన్న స్వర్ణ కోవిడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి 10 మంది మృతిచెందారు. ఇది ముమ్మాటికి తప్పే. దీనిపై విచారణ చేసేందుకు డాక్టర్ రమేష్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవ్వగా ఆయన పరారీలో ఉన్నారు.
రమేష్ హాస్పటల్స్ వారు స్వర్ణ సెంటర్‌ను కోవిడ్ సెంటర్‌గా మార్చేటప్పుడే అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రమాద ఘటనపై ఓ వైపు విమర్శలు వస్తున్నన క్రమంలోనే రామ్ ట్వీట్లతో సీఎం జగన్‌నే టార్గెట్‌గా చేసుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని ట్యాగ్ చేసి మీ వెనక కుట్ర జరుగుతోంది కాస్త గమనించండి అంటూ పోస్టింగ్ పెట్టారు. దీనిపై విమర్శలు రావడంతో రామ్ వెనక్కు తగ్గినా ఇంకా సోషల్ మీడియాలో రామ్‌ను పలువురు ట్రోల్ చేస్తున్నారు.
ప్రాణాలు పోతే మీకు బంధువు ముఖ్యమా ? అని కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు రామ్‌కు మద్దతుగా మాట్లాడడం కూడా రామ్‌కే మైనస్ అయ్యింది. సామాన్య జనాలతో పాటు వైసీపీ వాళ్లు రామ్‌ను టార్గెట్‌గా చేసుకుని ఆడుకుంటున్నారు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ రామ్‌ను ఓ రేంజ్‌లో ఉతికి ఆరేశారు. రామ్ సినిమాలు కమ్మ వాళ్లు చూస్తే చాలా ? అని ప్రశ్నించారు. అటు ఇండస్ట్రీలో కూడా రామ్ వ్యవహరించిన తీరు సరిగా లేదని కొందరు ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని గుసగుసలాడుకుంటున్నారు. ఏదేమైనా రామ్ అనవసరంగా ట్వీట్ చేసి ఇప్పుడు అందరికి శత్రువుగా మారుతున్నాడు.