చైనాకు చెందిన ప్రముఖ టిక్ టాక్ యాప్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫైనల్ వార్నింగ్ వచ్చేసింది. చైనా తీరుతో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు చైనా యాప్‌లను నిషేధిస్తున్నాయి. భారత్ కూడా చైనాకు చెందిన టిక్ టాక్, డింగ్‌టాక్, హలో యాప్‌లతో పాటు అనేక గేమింగ్ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనా భారీగా బిజినెస్ పోవడంతో విలవిల్లాడుతోంది. ఇక అటు అమెరికాలోనూ చైనా యాప్‌లపై నిషేధాస్త్రాలు వదులుతున్నారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్.
తాజాగా టిక్ టాక్‌కు ఆయన డెడ్‌లైన్ ఫిక్స్ చేశారు. ఈ టిక్ టాక్‌ను అమెరికాకు చెందిన ఏదైనా కంపెనీకి విక్రయించాలని, లేనట్లయితే ఆ యాప్‌ను తమ దేశంలో నిషేధిస్తామని ఇప్పటికే చెప్పిన ట్రంప్ మరోసారి ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. టిక్ టాక్ అమెరికా కార్యకలాపాలను అమెరికా కంపెనీకి విక్రయించేందుకు ఆయన ఆరు వారాల డెడ్ లైన్ పెట్టారు. సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఏదో ఒకటి తేల్చుకోవాలని లేదంటే నిషేధం తప్పదని స్పష్టం చేశారు.
టిక్‌టాక్‌ను అమెరికాలో మైక్రోసాఫ్ట్ లేదా మరే సంస్థకు విక్రయించినా తమకు అభ్యంతరం లేదని.. అయితే సురక్షితమైన అమెరికన్ కంపెనీ మాత్రం తమకు కావాలని ఆయన చెప్పారు. తమ పౌరుల సమాచారం భద్రత విషయంలో ఎలాంటి సమస్య ఉండకూడదని.. ఈ ఒప్పందం నుంచి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కూడా కోరుకుంటుందని ట్రంప్ తెలిపారు. మరోవైపు సెప్టెంబర్ 15వ తేదీలోగా తాము టిక్‌టాక్‌ను కొనుగోలు చేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.