ప్రపంచ మహమ్మారి కోవిడ్-19 వైరస్ కోసం నిమ్స్‌లో వేసిన కోవాక్టిన్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ వ్యాక్సిన్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఇక ఈ ప్రయోగం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 55 మంది వలంటీర్లకు ఈ టీకాలు వేశారు. సోమవారం మరో ఇద్దరికి టీకా ఇచ్చారట. ఈ లెక్కన ఇప్పటి వరకు టీకా వేయించుకున్న 55 మందిలో ఇద్దరికి మొదటి దశలోని మలి టీకా (బూస్టర్ డోస్)ను కూడా ఇచ్చారు. ఇక మరో రెండు రోజుల్లో మరో ఐదుగురికి టీకాలు వేస్తే నిమ్స్‌లో తొలి దశ ట్రయల్స్ ముగుస్తాయని చెపుతున్నారు.
కరోనాను కట్టడి చేసేందుకు హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన ఈ కోవాక్టిన్ వ్యాక్సిన్‌ను మనుష్యులపై ప్రయోగించేందుకు ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా మొత్తం 12 ఆసుపత్రులను ఎంపిక చేసింది. ఇందులో నిమ్స్ కూడా ఉంది. జూలై 14న ప్రారంభమైన ఈ ట్రయల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతున్నా దీని పూర్తి ఫలితం వచ్చేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని చెపుతున్నారు.
ఈ టీకా వేసిన వారిలో ఇప్పటి వరకు ఎవరికి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. మొదటి దశలో ఒక్కొక్కరికి 3 మిల్లీగ్రాముల డోస్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ప్రయోగం నడుస్తున్నా మరో నెల రోజులు ఆగితేనే అప్పటికి వ్యాక్సిన్ వేసిన వారి ఆరోగ్య పరిస్థితి సమీక్షించి.. ఆ తర్వాత దశలో మళ్లీ ప్రయోగాలు చేస్తారు. అవన్నీ కూడా సక్సెస్ అయితేనే ఇది సక్సెస్ అయినట్టు అవుతుంది.