`కృషి ఉంటే మనుషులు రుషులవుతారు!`- అనే విషయం ఆయన జీవితంలో నిజమైంది. ఆయనే ప్రకాశం జిల్లా పరుచూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. `మనిషై పుట్టిన వాడు కారాదు మట్టిబొమ్మ` అన్నట్టుగా ఏలూరి తన జీవితాన్ని అద్భుతంగా మలుచుకున్నారు. తనతోపాటు తన చుట్టూ ఉండే సమాజాన్ని కూడా అద్భుతంగా మలిచే ప్రయత్నం చేశారు.. ఇంకా చేస్తున్నారు కూడా! టీడీపీ నాయకుడిగా.. అత్యంత కీలకమైన నియోజకవర్గంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పెద్ద అల్లుడునే ఓడించి.. పార్టీ విజయ పతాకను రెపరెపలాడించిన ప్రజా నాయకుడు ఏలూరి.
ప్రకాశం జిల్లా మార్టూరులోని ఓ మార్టూరు మండలంలో సామాన్య మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఏలూరి సాంబశివరావు.. వాస్తవానికి ఓ సాధారణ ఉద్యోగి. నెలకో కొంత మొత్తం వేతనానికి పనిచేసిన చిరుద్యోగి. అయితే, ఆయన చాలా మంది యువత మాదిరిగా తన జేబు నిండితే.. తన కుటుంబం పండితే.. చాలని అనుకోలేదు. చుట్టూ ఉన్న సమాజానికి కూడా ఏదో ఒకటి చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే సదరు ఉద్యోగాన్ని పక్కన పెట్టి సొంతగా కంపెనీలు ప్రారంబించారు. భాగస్వామ్య వ్యాపారాలు కూడా చేశారు. దీంతో తాను జీవిస్తూనే వందల మంది యువతకు ఉపాధి కల్పించి.. సమాజ అభ్యున్నతికి కృషి చేశారు.
ఏలూరి సాంబశివరావు.. అన్నగారు ఎన్టీఆర్ అన్నా.. చంద్రబాబు అన్నా ప్రాణం పెట్టేవారు. ఈ క్రమంలోనే టీడీపీవైపు ఆకర్షితులై.. పచ్చకండువా కప్పుకొన్నారు. పరుచూరు నియోజకవర్గంలో అన్నగారు ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వేంకటేశ్వరరావు.. టీడీపీ నుంచి అనేకసార్లు విజయం సాధించారు. తర్వాత ఆయన 2004లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత 2009లోనూ అదే పార్టీ తరఫున విజయం సాదించారు. ఈ క్రమంలో నియోజకవర్గంలో టీడీపీ జెండాను మోసేవారే కరువయ్యారు. అప్పటి వరకు పార్టీలో ఉన్న సీనియర్లు సైతం నియోజకవర్గంలో టీడీపీని నిలబెట్టలేమని చేతులు ఎత్తేసి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏలూరి.. టీడీపీ జెండాను భుజాన వేసుకుని పాదయాత్ర చేశారు.
ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వారికి పార్టీ తరఫున అభయం ఇచ్చారు. ఇలా దగ్గుబాటి కే పరిమితమైన పరుచూరు రాజకీయాలను తనదైన శైలిలో తనవైపు తిప్పుకొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పరుచూరు ఇంచార్జ్ పోస్టును ఏలూరికి అప్పగించారు. 2013లో పంచాయతీ ఎన్నికల్లో దగ్గుబాటికి చెక్ పెట్టేలా ఏలూరి మంచి సీట్లు సంపాయించారు. ఇక, 2014 ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా ఏలూరి విజయం సాధించారు. నిజానికి దగ్గుబాటి హవా భారీగా ఉండే పరుచూరులో ఏలూరి విజయం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గత ఐదేళ్ల టీడీపీ పాలనలో అనేక కార్యక్రమాలు చేపట్టారు.
ప్రజలకు మరింత చేరువయ్యారు. ఈ పరిణామం.. 2019లో ఏలూరిని వరుసగా గెలుపు గుర్రం ఎక్కేలా చేసింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఓడించి ఏలూరి జెయింట్ కిల్లర్‌గా నిలవడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ వేవ్ ఉండడంతో టీడీపీకి చెందిన మహామహులే కొట్టుకుపోయారు. అయితే ఏలూరి మాత్రం తనదైన వ్యూహాలతో విజయం సాధించారు. ఎన్నికల్లో గెలిచాక కూడా ఏలూరి మాత్రం జగన్ వ్యూహాలకు ఎక్కడ దొరకకుండా పరుచూరులో ముందుకు వెళుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో ఓడిన దగ్గుబాటిని పక్కన పెట్టి మళ్లీ రావి రామనాథంకు పగ్గాలు ఇచ్చిన వైసీపీ ఇప్పుడు కరణం బలరాం లేదా ఆమంచి కృష్ణమోహన్ లేదా మరో ఎన్నారైకు ఇక్కడ పగ్గాలు ఇవ్వాలని చూస్తోంది.. అయితే వీళ్లెవ్వరు ఏలూరికి సరైన పోటీ ఇవ్వలేరని మళ్లీ తమలో తామే మల్లగుల్లాలు పడుతోన్న పరిస్థితి కూడా ఉంది.
ఇక వరుస విజయాలతో పాటు చిన్న రిమార్క్ కూడా లేకపోవడం పరుచూరులోనే కాకుండా ప్రకాశంలో కూడా ఏలూరి రేంజ్‌ను పెరిగేలా చేసింది. నిజానికి గత ఏడాది జగన్ హవా నేపథ్యంలో కీలకమైన టీడీపీనాయకులు మట్టి కరిచారు. కానీ, ఏలూరి మాత్రం విజయం అందుకున్నారు. అయితే, కాయలున్న చెట్టుకే రాళ్లన్నట్టుగా.. ప్రజాదరణ ఉన్న ఏలూరిపై ఓవర్గం వికృత ప్రచారం చేసింది. ఆయన టీడీపీకి రాం రాం చెబుతారని విష ప్రచారం చేశారు. ఈ పరిణామంతో ఒకింత ఇబ్బంది పడినా.. ఏలూరి మాత్రం టీడీపీని వీడే పరిస్థితి లేదని తన చర్యల ద్వారానే నిరూపించారు. ఉత్తమ ప్రజా సేవకుడుగా ఆయన ఇటీవల అంతర్జాతీయ అవార్డు కూడా అందుకోవడం విశేషం.