ప్రపంచ మహమ్మారి కరోనా వైరస్ ( కోవిడ్ 19 ) రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 17,821,155 కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాలు 684,096 గా నమోదు అయ్యాయి. ఇక కరోనా పుట్టిన చైనాతో పాటు ఆసియా దేశాలు అయిన దక్షిణ కొరియా, జపాన్లో కూడా కొత్త కేసులు నమోదు అవుతుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు సరికొత్త ఆందోళన చెలరేగుతోంది. యూరప్ దేశాలు అయిన బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీలో ఇప్పుడు కేసుల్లో కొత్త లక్షణాలు నమోదు అవుతుండడంతో సరికొత్త భయాలు కూడా నమోదు అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే ఇప్పుడు ప్రపంచం ముందు ఉన్న ఆయుధం. భారత్తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఇప్పుడు కరోనా వైరస్ గురించి వ్యాక్సిన్ కోసం అనేకానేక పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పరిశోధనలు ట్రయల్స్ దశలో ఉన్నాయి. మరి కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ మూడో దశలో ఉంది. రష్యా అయితే ఆగస్టు 10వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ప్రజలకు పంపిణీ చేస్తామని కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే కొన్ని దేశాల్లో పరిశోధనల్లో సానుకూల ఫలితాలు కూడా వస్తున్నాయి.
ఇక మనదేశంలో అగ్రగామి ఫార్మా కంపెనీల్లో ఒకటి అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అమెరికాకు చెందిన కోడో జెనిక్స్ అనే సంస్థతో కలిసి కరోనా వ్యాక్సిన్ కోసం పరిశోధనలు చేస్తోంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ తయారీ కంప్లీట్ అవ్వగా ఇది ఎలుకలపై ప్రయోగిస్తున్నామని.. త్వరలోనే ఈ వ్యాక్సిన్ మనుష్యులపై ప్రయోగించి.. ఆ తర్వాత ఫలితాలు ఎలా ఉంటాయో నివేదించుకుంటామని సీరమ్ ఇన్స్టిట్యూట్ సంస్థ వెల్లడించింది. ఇక నాలుగేళ్ల క్రితం స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు దాని వ్యాక్సిన్ కోసం మన దేశంలో పరిశోధన చేసిన సంస్థలు ఇప్పుడు కరోనా వైరస్ విషయంలో కూడా పరిశోధనలు చేస్తున్నాయి.