హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తూనే వైవిధమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ సైలెంట్ గా దూసుకుపోతున్న మెగా హీరో వరుణ్ తేజ మరో వైవిధ్యమైన పాత్రను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ – వరుణ్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతోంది అంటూ… గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.’జిగర్తాండా’ అనే రీమేక్ సినిమాలో వరుణ్ తేజ విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే…. విలన్ పాత్ర కోసం వరుణ్ ని సంప్రదించగానే కాస్త వెనుకా ముందు ఆలోచించాడట వరుణ్.
కానీ చిరంజీవి ఈ విషయంలో కలగచేసుకుని …తను కూడా కెరీర్ మొదట్లో ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేసానని, కెరియర్ బాగుంటుంది అని ఒప్పించినట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట లు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మరో హీరో కూడా చేయనున్నారు. తమిళంలో సిద్ధార్థ్ హీరోగా బాబీ సింహా విలన్ గా వచ్చిన ‘జిగర్తాండా’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సమయంలో వరుణ్ ఇలా విలన్ పాత్ర ఎంపిక చేసుకోవడం మాత్రం నిజంగా సాహసమే. కాకపోతే విలన్ గా .. హీరోగా రెండు పడవల మీద ప్రయాణం చెయ్యడం వరుణ్ కెరియర్ ని గందరగోళంలో పడేస్తుంది. అంతే కాదు… హీరోని విలన్ గా చూసి మళ్ళీ హీరోగా చూడడం ప్రేక్షకులకు కూడా ఇబ్బందే. దీంతో అనవసర గందరగోళం ఏర్పడి మొదటికే మోసం వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే సాఫ్ట్ హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్న వరుణ్ ఈ విలన్ పాత్రకు ఒప్పుకుని పెద్ద తప్పే చేసాడేమో అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.