Moviesబాక్సాఫీస్ లెక్కలు మారుస్తున్న తెలుగు ప్రేక్షకుడు

బాక్సాఫీస్ లెక్కలు మారుస్తున్న తెలుగు ప్రేక్షకుడు

తెలుగు చిత్ర రూపు రేఖలను పూర్తిగా మార్చేస్తున్నాడు సగటు ప్రేక్షకుడు. తనకు కావాల్సిన కంటెంట్ సినిమాలో లేకపోతే ఎంతటి తోపు హీరో సినిమా అయినా కూరలో కరివేపాకులా తీసి పక్కన పెట్టేస్తున్నాడు. ఒక సగటు ప్రేక్షకుడిని ఎలా మెప్పించాలా అని తలలు పట్టుకుంటున్న పెద్ద డైరెక్టర్లకు తమ సత్తా చూపిస్తున్నారు కొత్త డైరెక్టర్స్. నేటి ప్రేక్షకుడు ఏదైతే కోరుకుంటున్నాడో అది సినిమాలో చూపించగలిగితే బొమ్మ హిట్టు అనే నమ్మకం వారిలో కలిగింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోతున్నాయి.

గతంలో కేవలం పెద్ద స్టార్ హీరోల సినిమాలకే బాక్సాఫీస్ లెక్కలు ఉండేవి. చిన్నా చితక హీరోలను కనీసం పట్టించుకునే నాథుడే లేడా అనేంత రేంజులో ఈ ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే కాలం మారిన కొద్దీ ఈ ఫ్యాన్ బేస్ ఆచారానికి గండి పడింది. సగటు ప్రేక్షకుడు సినిమాలో సత్తా ఉంటే అది స్టార్ హీరోదా లేక చిన్న హీరోదా అనే తేడా చూడటం లేదు. కంటెంట్‌లో మ్యాటర్ ఉంటే ఓటు ఆటోమేటిక్‌గా పడిపోతుంది. దీనికి ఉదాహరణగా ఈ ఏడాదిలో వచ్చిన కొన్ని చిత్రాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

2018లో స్టార్ హీరోల సినిమాల్లో అసలు విషయం ఉంటేనే వాటిని బాక్సాఫీస్ రాజులుగా మలిచారు ప్రేక్షకులు. అదే విధంగా చిన్న సినిమాల్లో తమకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నదంటే చాలు థియేటర్లకు పరుగులు పెట్టారు జనం. రామ్ చరణ్ తేజ్ ‘రంగస్థలం’ చిత్రం నిజానికి ఒక రొటీన్ ఎంటర్‌టైనర్. కానీ ఆ సినిమాను తెరకెక్కించిన విధానం, బ్యాక్‌డ్రాప్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చూపించడంతో దీనికి బ్రహ్మరథం పట్టారు జనాలు. ఏకంగా నాన్-బాహుబలి రికార్డులతో ఈ సినిమా రేంజ్ ఏమిటో తెలియజేశారు ప్రేక్షకుడు. అలాగే మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని కూడా అదే తరహాలో ఆదరించారు ప్రేక్షకుడు. రొటీన్ కథకు మంచి స్క్రీన్‌ప్లే తోడయితే ఇలాంటి ఫలితాలే ఉంటాయని మరోసారి ప్రేక్షకుడు తెలియజేశాడు.
1

2
ఇక బయోపిక్ చిత్రాలకు జనాలు సులువుగా కనెక్ట్ అవుతారు. అయితే అలా అని ఏది పడితే అది తీస్తే నడవదు. ఇది గ్రహించే ’మహానటి‘ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో సావిత్రి జీవితానికి సంబంధించిన విషయాలను నేటితరం ప్రేక్షకులు తెలుసుకునేందుకు చూపించిన ఆసక్తి మామూలుగా లేదు. అంతేగాక ఈ సినిమాను ప్రేక్షకుడికి దగ్గరయ్యేలా చూపించిన విధానంతో ఇది బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరోవైపు నేటి యూత్ బోల్డ్‌నెస్‌ను ఎక్కువగా ఆదరిస్తున్నారని స్పష్టం అవుతుంది. ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా సృష్టించిన భీబత్సం మరవకముందే అదే సినిమా స్ఫూర్తితో RX100 అంటూ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆడవారు మోసం చేయడం అనే నిజాన్ని ధైర్యంగా చూపించిన విధానం నేటి యూత్‌కు బాగా కనెక్ట్ కావడంతో వారు ఈ సినిమాకు పట్టం కట్టారు. ఒక చిన్న సినిమా అందులోనూ స్టార్‌డం లేని నటీనటులతో బాక్సాఫీస్‌ను చెడుగుడు ఆడుకున్న చిత్రంగా RX100 నిలిచింది.
3

4

5
మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటే చాలు ఆ సినిమాకు మార్కులు వేసేస్తాం అని రుజువు చేస్తూనే ఉన్నారు సినీ జనాలు. ఛలో, గీత గోవిందం వంటి కామెడి ఎంటర్‌టైనర్లు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడంతో వారు ఈ సినిమాలను సూపర్ హిట్స్‌గా చేశారు. అంతేగా రొమాన్స్, హార్రర్ సినిమాలకు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు అని భాగమతి, తొలిప్రేమ చిత్రాలు రుజువు చేశాయి. ఇక మహేష్ లాంటి స్టార్ హీరో కోట్లు పెట్టి చేసిన ‘స్పైడర్’ సినిమాలో స్పై అనే అంశం పక్కనబెట్టి పనికిరాని చెత్తనే ఎక్కువగా వాడటంతో ప్రేక్షకులు కూడా ఆ సినిమాను పక్కనబెట్టారు. అయితే స్పై ఎంటర్‌టైనర్ అనేది ఎలా ఉంటుందో కేవలం 5 కోట్ల బడ్జెట్‌తో వచ్చిన ‘గూఢచారి’ సత్తా చాటడంతో ప్రేక్షకులు దీన్ని బాక్సాఫీస్ వద్ద హిట్ చేశారు.
6

7

8

9

10

11
అయితే ప్రతీసారి ప్రేక్షకుల తీర్పుతోనే హీరోలు జయాపజయాలు సాధించరు. తమ ఫ్యాన్స్‌కు ఎలాంటి సినిమా ఇద్దామా అనే కన్ఫ్యూజన్‌లో చేతులు మూతులు కాల్చుకున్న హీరోలు కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య లాంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయి. ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో తెలియకుండా తమకు నచ్చిన సబ్జెక్ట్‌ను వారిపై రుద్దాలని చూసి బొక్కబోర్లా పడ్డారు మరికొంతమంది హీరోలు.
12

13
ఏదేమైనా సగటు తెలుగు ప్రేక్షకుడి టేస్ట్ మారిందనే విషయం ఇటీవల బాక్సాఫీస్ రిజల్ట్ చూస్తే అర్ధం అవుతోంది. మంచి ఎంటర్‌టైనర్ చిత్రాలకు వారు పెద్దపీట వేసి సక్సెస్ చేస్తున్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేయకుండా కొత్తదనాన్ని ప్రేక్షకుడికి అందించాలని చేసే ఏ దర్శకుడికైనా హిట్టు బొమ్మ ఖాయం అని ప్రేక్షకుల తీర్పు చేబుతోంది. ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుని సినిమాలు చేస్తే అవి ఖచ్చితంగా హిట్ అవుతాయని మన హీరోలు ఎప్పుడు తెలుసుకుంటారో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news