పాటలు లేని తెలుగు సినిమా .. ఫైట్ లు ఉండవు. ఏ సగటు సినిమా కమర్షియల్ వాసనలు అస్సలు ఉండవు. సమాజ సహజ పాత్రలు డిఫరెంట్ టేకింగ్ .. చాలా తక్కువ బడ్జెట్లో సినిమా తీసి పెట్టాలని రామినేని సాంబశివరావు అనే నిర్మాత దర్శకుడు దాసరి నారాయణరావుని అడిగారు. దాసరి నారాయణరావు అంటే అప్పట్లో ఒక బ్రాండ్. తన పేరు పోస్టర్ మీద కనిపిస్తే చాలు .. అదే మార్కెటింగ్ అయిపోయేది. రామినేని లాంటి నిర్మాత చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా కావాలని అడిగినప్పుడు మహా అయితే రెండు వారాలు ఆడుతుందేమో సినిమా అని బదులిచ్చాడు దాసరి నారాయణరావు. అయినా సరే నాకు అలాంటి సినిమా కావాలని చెప్పాడు. కొత్త నటీనటులు ఏదో ఒక చిన్న కథ దాసరి తీసుకున్నాడు.
పంపిణీదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు .. అలా మొదలైంది నీడ అనే సినిమా. మీ అబ్బాయిలను హీరోయిన్ హీరోలుగా పరిచయం చేస్తాను అని సూపర్ స్టార్ కృష్ణతో అన్నాడు దాసరి. అప్పటికి రమేష్ బాబు వయసు 14 ఏళ్ళు .. మహేష్ బాబు వయసు నాలుగేళ్లు.. దాసరి అడిగాక కృష్ణ గారు నో అంటాడా వెంటనే ఓకే చెప్పాడు. అలా ప్రయోగాత్మకంగా నీడ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా యూట్యూబ్లో లేదు .. పాటలు లేవు కాబట్టి వీడియోలు కూడా లేవు. 1979లో రిలీజ్ అయింది. కేవలం 14 రోజుల్లోనే విజయవాడ పరిసరాల్లో షూటింగ్ పూర్తి చేశాడు.
దాసరి నారాయణరావు తను చేరదీసిన ఎర్ర స్టార్ నారాయణ మూర్తి కి కూడా ఒక పాత్ర ఇచ్చారు. రమేష్ బాబుది మరో పాత్ర. కథంతా చిన్న పిల్లలు… ఎదిగే పరిస్థితిలో చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం మీద నడుస్తుంది. ఆ సెట్లో బాల మహేష్ నుదిటిన బొట్టు పెట్టి ఉజ్వల కెరీర్‌కు నాంది పలికాడు దాసరి నారాయణరావు. ఇక అప్పుడే డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లోకి వచ్చిన నారాయణమూర్తికి ఈ సినిమాలో రాడికల్ రోల్ ఇచ్చాడు దాసరి. ఆ తర్వాత నారాయణమూర్తి చాలా నక్సల్స్ నేపథ్యం ఉన్న సినిమాలు చేసిన దానికి నీడ సినిమాయే ఆరంభం. అలా మహేష్ బాబు అభిమానులు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన సినిమా నీడ.