TL రివ్యూ: క
టైటిల్ : క
నటీనటులు : కిరణ్ అబ్బవరం, తన్వీరామ్, నయన్ సారిక, అచ్యుత్ కుమార్ తదితరులు
సంగీతం : సామ్ సిఎస్
ఎడిటింగ్ : శ్రీ వరప్రసాద్
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి
నిర్మాత : చింతా గోపాలకృష్ణ
రచన – దర్శకత్వం: సుజీత్ – సందీప్
రిలీజ్ డేట్: 31 – 10 – 2024
ఈ దీపావళికి బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించేందుకు పలు సినిమాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నటించిన సినిమా క ఒకటి. ఈ సినిమా గురించి కిరణ్ చెప్పిన మాటలు.. విసిరిన సవాళ్లు సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేశాయి.. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.
కథలోకి వెళదాం…
అభినయ వాసుదేవ్ ( కిరణ్ అబ్బవరం ) ఓ అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగి వస్తారని ఆశలతో జీవిస్తూ ఉంటాడు. ఇతరుల ఉత్తరాలు చదువుతూ వాటిని తన సొంతవాళ్లే రాసినట్టు ఊహించుకుంటూ వెళుతుంటాడు. ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టర్ గురునాథం ( బలగం జయరాం ) వాసును కొట్టడంతో ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాసు కృష్ణగిరికి వచ్చి అక్కడ కాంట్రాక్ట్ పోస్ట్‌మ్యాన్ గా ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే పోస్ట్ మాస్టర్ రంగారావు ( అచ్యుత్ కుమార్ ) కూతురు సత్యభామ ( నైను సారిక ) తో ప్రేమలో పడతాడు. అదే టైంలో ఆ ఊర్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతూ ఉంటారు. అయితే ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు ఓ ఉత్తరం వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన ఓ ముఖ్యమైన క్లూ దొరుకుతుంది. అక్కడ నుంచి వాసుదేవ్ జీవితం సమస్యల్లో పడుతుంది.. ఆ ఊరు అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు ? వాసుతో పాటు టీచర్ రాధ ( తన్వి రామ్) ను కిడ్నాప్ చేసి వేధించే ఆ ముసుగు వ్యక్తి ఎవరు ? ఆ ముసుగు వ్యక్తి భార్య నుంచి వీళ్ళిద్దరూ ఎలా బయటపడ్డారు.. వాసుదేవ్ సత్యభామ ప్రేమ ఫలించిందా అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం ఎలా ఉందంటే..
క లాంటి కథ.. కథనాలు ఉన్న సినిమా ఇంతవరకు రాలేదు.. అలా వచ్చిందని నిరూపిస్తే తను సినిమాలు మానేస్తా అంటూ ఈ సినిమా గురించి ప్రచారంలో హీరో కిరణ్ చాలా పెద్ద మాటలు చెప్పారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు నిజంగా మెస్మరైజ్ అయిపోతారు. కిరణ్ చెప్పిన మాటలను నూటికి నూరు శాతం నిజం. దర్శకులు ఇద్దరు కలిపి ఎంచుకున్న కథ నాన్ లినియర్ స్టైల్ లో దాన్ని నడిపించిన తీరు ఈ కథ సెట్ చేసిన క్రిష్ణగిరి ఊరు.. అందులో సమస్య దానిని పరిష్కరించే క్రమంలో హీరోకు ఎదురయ్య సవాళ్లు ఇలా అన్ని ఆకట్టుకుంటాయి.. సరికొత్త అనుభూతి ఇస్తాయి. మరి ముఖ్యంగా మనిషి పుట్టుక.. కర్మఫలం.. రుణానుబంధం ఈ మూడు అంశాలను ముడిపెట్టి దర్శకుడు చెప్పిన సందేశం తో పాటు కథను ముగించిన తీరు అదిరిపోతుంది.
హీరోను ముసుగు వ్యక్తి కిడ్నాప్ చేసి చీకటి గదిలో బంధించడంతో సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది. క్రిష్ణగిరి కి వచ్చాక అసలు కథ ఆరంభం అవుతుంది. ఊళ్ళో అమ్మాయిలు కనిపించకుండా పోవడం వాసు – రాధ మధ్య నడిచే కథ ఇలా ప్రతి సీన్ ప్రేక్షకుల ఆసక్తి రేకెత్తిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ఇంటర్వెల్ సెకండాఫ్ పై బాగా అంచనాలు పెంచుతుంది. ఊర్లో అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణం ఎవరు? అలా మాయం అవుతున్న అమ్మాయిలు ఏమవుతున్నారు.. ముసుగు వ్యక్తి చెర నుంచి వాసుదేవ్ – రాధ ఎలా ? బయటపడ్డారు అన్న కోణంలో సెకండాఫ్ నడుస్తుంది. మధ్యలో వచ్చే కోర్టు.. ఎలక్షన్ సీక్వెన్స్ .. జాతర పాట క్లైమాక్స్ ఫైట్ మాస్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. చివరి 15 నిమిషాలు కథ ఊహించిన మొలికలు తిరుగుతుంది.. ఓ సరికొత్త అనుభూతి అందిస్తూ ప్రేక్షకులతో క్లాప్స్ కొట్టించుకుంటుంది.
నటీనటుల పనితీరు…
ఇది హీరో కిరణ్ కెరీర్ మలుపు తిప్పే సినిమా. అభినయ వాసుదేవ్‌గా కిరణ్ తెరపై సహజసిద్ధమైన నటనతో అదరగొట్టేశాడు. ఫైట్లతో పాటు ఎమోషన్ సన్నివేశాలు తనదైన నటనతో కట్టిపడేశాడు. నైనా సారిక క్యూట్ లుక్ తో ఆకట్టుకుంది. ఆమెకు కిరణ్ తో ఉన్న లవ్ ట్రాక్ బాగుంది. ఇది పూర్తిగా దర్శకులు సుజిత్ – సందీప్ సినిమా కాన్సెప్ట్.. స్క్రీన్ పై గ్రిప్పింగ్‌గా సాగింది. ఫస్ట్ అఫ్ సెకండ్ హాఫ్ లో కొన్ని లోటుపాట్లు ఉన్న క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ దెబ్బకు అన్ని పటా పంచలు అయిపోతాయి. క పదానికి వెనక ఉన్న అర్థం 1970వ దశకంలో కాలానికి తగినట్టుగా ఆర్ట్ వర్క్ బాగా కుదిరింది. ప్రేక్షకులకు సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సామ్ సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ పాటలన్నీ వినసొంపుగా ఉన్నాయి. జాతర పాట మాస్‌ను ఊపేస్తుంది. యాక్షన్ సన్నివేశాలల నేపథ్య సంగీతం హీరోని బాగా ఎలివేట్ చేసింది. విజువల్స్ బాగున్నాయి.. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. ఈ సినిమాకు కథనాలు కిరణ్ అబ్బవరం నటన ఇంటర్వెల్ క్లైమాక్స్.. ట్విస్టులు.. ప్లస్ పాయింట్లు ఇక ఊహలకు తగినట్టుగా సాగే కొన్ని సన్నివేశాలు మైనస్ గా ఉన్నా ఓవరాల్‌గా క కిర్రాక్ సినిమా అని చెప్పాలి.
ఫైనల్ పంచ్ : క అదిరిపోయే కిర్రాక్ సినిమా
క రేటింగ్ : 3.25 / 5