బ్యానర్: యువసుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్
టైటిల్: దేవర 1
నటీనటులు: ఎన్టీఆర్, జాన్వీకపూర్, సైఫ్ ఆలీఖాన్, బాబీడియోల్, ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రత్నవేలు
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్ : సాబు సిరిల్
నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్ – కొసరాజు హరికృష్ణ
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం : కొరటాల శివ
రిలీజ్ డేట్: 27 సెప్టెంబర్, 2024
సెన్సార్ రిపోర్ట్: U / A
రన్ టైం: 177 నిమిషాలు
వరల్డ్ వైడ్ టార్గెట్: రు. 180 కోట్లు
TL పరిచయం :
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ వెండితెర మీద కనిపించి రెండున్నరేళ్లు అయ్యింది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ సినిమా రాలేదు. అది రామ్‌చరణ్‌తో నటించిన మల్టీస్టారర్.. అదే ఎన్టీఆర్ సోలో సినిమా అయితే 2018 చివర్లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ. ఐదున్నరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా చేస్తోన్న సినిమా దేవర. ఎన్టీఆర్ సోలో స్టెప్పులు.. సోలో డ్యాన్సులు.. డైలాగుల కోసం నందమూరి, ఎన్టీఆర్ అభిమానులే కాకుండా.. తెలుగు సినీ ప్రేమికులు.. ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తపించిపోతున్నారు. వారి కోరిక ఎట్టకేలకు దేవర రూపంలో ఈ రోజు తీరబోతోంది. అటు ఆచార్య లాంటి ఘోరమైన డిజాస్టర్ తర్వాత కొరటాల శివ లాంగ్ గ్యాప్ తీసుకుని కసితో దేవర తీశారు. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ కావడంతో సహజంగానే అంచనాలు ఉన్నాయి. రెండు పార్టులుగా వస్తోన్న దేవర.. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ మానియాను కంటిన్యూ చేస్తుందా ? ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు అంచనాలు అందుకుందా లేదా ? అన్నది TL సమీక్షలో చూద్దాం.
కథ :
దేవర ( ఎన్టీఆర్ ) భైర ( సైఫ్ ఆలీఖాన్ ) స్నేహితులు. సముద్రంలో కొందరు వ్యాపారుల స్మగుల్ గూడ్స్ దొంగతనానికి సాయం చేయడం.. చేపలు పట్టడం చేస్తూ బతుకుతూ ఉంటారు. మరో హీరో శ్రీకాంత్ కూడా ఇదే టీంలో ఉంటాడు. సమీపంలో నాలుగు గ్రామాలకు చెందిన వారంతా ప్రతి యేటా ఆయుధ పూజలో పాల్గొని మిగిలిన గ్రామాల వారిని ఓడించి ఆయుధాలను ఆ యేడాది వాళ్ల ఊరికి తీసుకెళుతుంటారు. దేవర .. భైరను ఓడించి ఒక్కసారి ఆయుధాలు వెళ్లని శ్రీకాంత్ గ్రామానికి ఆయుధాలు వెళ్లేలా చేస్తాడు. ఆ సంఘటనతో పాటు దేవర ఆధిపత్యం భైర సహించలేకపోతుంటాడు. ఈ క్రమంలోనే దేవరపై భైర పగబట్టడం.. ఆ తర్వాత దేవర కనిపించకుండా పోవడం జరుగుతుంది.. ఇలా దేవర మాయమై 12 ఏళ్లు అవుతుంది. ఆ తర్వాత దేవర కొడుకు వర ( ఎన్టీఆర్ ) ఎంట్రీ ఇచ్చి తన తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని.. తండ్రిపై కోపంతో భైర టీంలో చేరడం.. తన తండ్రిపై కోపంతో తండ్రినే చంపాలనుకోవడం చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే వరను తంగం ( జాన్వీకపూర్) ప్రేమిస్తుంది…ఇక భైర కూడా దేవరను చంపేందుకు వరను పంపుతాడు… మరి వరతో పాటు భైర టీం దేవరను చంపిందా ? అసలు దేవర అన్నేళ్ల పాటు ఏమయ్యాడు ? ఎక్కడ ఉన్నాడు… తొలి పార్ట్ ఎక్కడితో ముగిసింది అన్నదే కథ.
TL విశ్లేషణ & డైరెక్షన్ ఎనాలసిస్ :
దర్శకుడు కొరటాల శివ సినిమాను చాలా స్లోగా స్టార్ట్ చేశాడు. సినిమా తొలి 30 నిమిషాలు అస్సలు కథ ఓ పట్టాన ముందుకు కదలదు.. చాలా స్లోగా వెళుతుంది. తొలి 30 నిమిషాలు రొమాలు నిక్కపొడుచుకునే సీన్ .. ఫ్యాన్స్ మరీ విజిల్ వేసే మూమెంట్ ఒక్కటి కూడా లేదంటే కొరటాల రొటీన్ ఫ్లాట్‌తో సినిమాను స్టార్ట్ చేసేశాడనే చెప్పాలి. సైఫ్ ఆలీఖాన్ .. ఎన్టీఆర్ మధ్య ఆయుధాలు దక్కించుకునేందుకు వచ్చిన తొలి ఫైట్ కు కూడా ఫ్యాన్స్ నుంచి అనుకున్న రేంజ్‌లో విజిల్ మూమెంట్ లేదు. ఏదో ఉంది అంటే ఉంది. తొలి గంట పాటు ఎన్టీఆర్ అంటే కోసుకునే ఫ్యాన్స్‌కు కూడా సరైన విజిల్ మూమెంట్… ఈలలు పెట్టి గోల చేసే సీన్ పడలేదంటే కొరటాల టేకింగ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. సినిమా మొదలై గంట దాటిపోయినా కథ ఓ పట్టాన ముందుకు సాగదు.. అస్సలు మలుపులు ఉండవు… ట్విస్టులు ఉండవు.. చాలా అంటే చాలా ప్లాట్ కథ, కథనాలతో ముందుకు సాగుతుంది. కొంత నిట్టూర్పు కూడా తప్పదు. ఇంటర్వెల్ దగ్గరకు వస్తోంది… సినిమా చూస్తోన్న ఓ ఎన్టీఆర్ వీరాభిమాని చెప్పిన మాట ఏంటంటే.. ఇదేం స్టోరీ.. ఇంట్రస్ట్ లేదు… చూడబుద్దైత లేదు. సినిమా కొచ్చే ముందు పెరుగన్నంలో ఉప్పు ఎక్కువ వేసుకుని.. ఊరగాయ నంజు గట్టిగా పెట్టుకుని తిని వచ్చినా నరాలు ఏ మాత్రం ఉప్పొంగ లేదు.. ఇంటర్వెల్ అయినా లేపుతావా.. అని దేవుడికి దండం పెట్టుకోవడం ఒక్కటే మిగిలి ఉంది. ఇంటర్వెల్ వరకు జాన్వీకపూర్ ఎంట్రీ లేదు… కనీసం ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా వీక్…!
సెకండాఫ్‌లో ఆయుధాల కోసం వర చేసే ఫైట్‌తో సినిమాకు కాస్త ఊపు వచ్చింది. తెరమీద ఎన్టీఆర్ కొడుతుంటే భైర గ్యాంగ్ ప్రాణాలతో కొట్టుమిట్టాడడం ఏమోగాని … కొరటాల కొట్టిన దెబ్బకు థియేటర్లో విలవిల్లాడుతోన్న ప్రేక్షకుడికి ఈ ఫైటే కాస్త ఊపిరి పోసింది. సెకండాఫ్‌లో వర ఫైట్ తర్వాత వచ్చిన చుట్టమల్లే చుట్టేస్తోంది సాంగ్‌తో ప్రేక్షకులు కాస్త రిలీఫ్ అవుతారు. సెకండాఫ్‌లో దేవర తిరిగి చాలా యేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పుడు అయినా కూడా కనీసం విజిల్స్ పడలేదు.. ఏలూరు జిల్లా కామవరపుకోట శ్రీ దుర్గామహాల్ థియేటర్ మొత్తం కిక్కిరిసి పోయి సీట్లు నిండి కనీసం ఓ 50 మంది ప్రేక్షకులు నుంచొని చూస్తున్నారు.. వాళ్లు కూడా ఫిండ్రాఫ్ సైలెంట్ అయి తెరమీద ఏం జరుగుతుందో అర్థంకాక చూస్తున్నారే తప్పా ఉషారు లేదు.. ఉత్సాహమూ లేదు.
మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడడానికి పుట్టాయి. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయి. నువ్వుకాని మీ వాళ్లు కోసం ఈ పని కోసం మళ్లీ నా దగ్గరకు వస్తే మీ శవాలు కూడా ఈ గట్టు దిగవు.. ఇదే ఈ దేవర మాట. ఈ డైలాగ్‌తో పాటు ట్రైలర్‌లో చెప్పిన ఒకటి రెండు డైలాగులు మినహా కొరటాల గొప్పగా రాసిన డైలాగులు లేవు. అస్సలు ఒక్క డైలాగ్‌కు కూడా విజిల్స్ లేవంటే లేవు. సెకండాఫ్‌లో వర సముద్రంలో చేసే ఫైట్ చూడడానికి బాగున్నాఅప్పటికే డీలా పడిన ప్రేక్షకుడికి ఆ జోష్ సరిపోలేదు. కనీసం జనతా గ్యారేజ్‌లో ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యింది. ఈ సినిమాలో దానిని కూడా కొరటాల సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు. ఆచార్య సినిమా చూసి కొరటాల తప్పులేదు.. చిరు కెలికేశాడు… వాళ్లు కాళ్లు.. వేళ్లు పెట్టేశారని సరిపెట్టుకున్నాం.. కానీ దేవర 1 చూశాక కొరటాల బుర్రలో గుజ్జు అయిపోయిందని.. మనోడు కొత్తగా ఆలోచించడం.. కొత్తగా రాయడం.. తీయడం మర్చిపోయాడని క్లీయర్‌గా తెలుస్తోంది. మరీ మూస రొటీన్ ముతక కథకు తోడు తనదైన నీరసపు స్క్రీన్ ప్లేతో సినిమాను ఏ మాత్రం జనరంజకంగా తీర్చిదిద్దలేకకపోయాడు.
నటీనటుల పెర్పామెన్స్ :
నటీనటుల పరంగా చూస్తే ఎన్టీఆర్ తనకు అలవాటైన రీతిలో చేసేశాడు. పాత్రలో దమ్ము లేనప్పుడు ఎంత ఎఫర్ట్ పెట్టినా ఉపయోగం లేదు. సైఫ్ ఆలీఖాన్‌కు.. ఎన్టీఆర్‌కు ఫస్టాఫ్‌లో వచ్చే సీన్లు అన్నీ రొటీన్‌గానే ఉంటాయి. ఎన్టీఆర్ కొత్తగా చేయడానికి కాని.. కొత్తగా చూపించడానికి కానీ స్కోప్ లేకపోవడంతో నటన పరంగా గొప్పగా చెప్పుకునేదేం లేకుండా పోయింది. తన తోటి స్టార్ హీరోలతో కంపేరిజన్ చేస్తే ఎన్టీఆర్ తన ఫిజిక్ మీద ఇంకా కాన్‌సంట్రేషన్ చేయాలనిపిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ గెటప్.. కొబ్బరిచిప్ప బోర్లించిన కటింగ్ అస్సలు నప్పలేదు. అసలు ఈ పాత్ర కోసం సైఫ్ ఆలీఖాన్ కంటే మన లోకల్ విలన్లు అయితే సరిపోయేది. సైఫ్ గెటప్ కాని.. యాక్షన్ మూమెంట్స్ కాని.. ఎక్స్‌ప్రెషన్స్ కాని ఏ మాత్రం గొప్పగా లేవు. సైఫ్ ఆలీఖాన్.. తెరీమద విలన్‌గా ఉన్నాడంటే తెరషేక్ అవ్వాలి.. కాని థియేటర్లో ఉన్నవాళ్లు లో బీపితో పడేలా ఆ పాత్ర ఉంది. జాన్వీకపూర్ ఎన్టీఆర్‌కు జోడీగా తెలుగులో ఫస్ట్ సినిమా అంటే కుర్రాళ్లకు యేడాది కాలంగా నిద్రలు లేవు.. శ్రీదేవిని మించిన అందంతో.. అభినయంతో ఉంటుందని కలలు కంటూ వచ్చారు. లోపల చూస్తే నాలుగైదు సీన్లు.. పట్టుమని ఐదారు డైలాగులు లేకుండా ఊసురోమన్నారు. దేవర భార్యగా చేసిన మరాఠి అమ్మాయి శృతి మరాఠి తెరమీద సీన్లలో ఉండడం మినహా ఆమె చేసిందేమి లేదు.. సినిమాకు ఆమెతో ఒరిగిందీ లేదు. చివర్లో ప్రకాష్‌రాజ్‌ను తన భర్త ఎక్కడున్నాడు అనే ఒక్క మంచి సీన్ మాత్రమే ఆమెకు హైలెట్. శ్రీకాంత్ పాత్ర జస్ట్ ఉంది. తాళ్లూరి రామేశ్వరి భవిష్యత్తు చెప్పే చిన్న అమ్మోరి టైప్ పాత్ర పోషించారు. ప్రకాష్‌రాజ్ కథను చెపుతూ… కథను నెరేట్ చేసే పాత్రకు పరిమితం అయ్యారు.
టెక్నికల్‌గా ఎలా ఉందంటే…
అమ్మతోడు అనిరుధ్ రవిచంద్రన్ తమిళ సినిమాలు.. తమిళ స్టార్ హీరోల సినిమాల రేంజ్‌లో మనసుపెట్టి మ్యూజిక్ ఇవ్వలేదు. ఆల్బమ్ ఎబో యావరేజ్… నేపథ్యం సంగీతం మరీ సూపర్.. డూపర్ అని చెప్పలేం.. జస్ట్ ఓకే అనిపించింది. మనస్సుకు హత్తుకోలేకపోయింది. నీరసపు సీన్లను తన బీజీఎంతో ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నా… రీ రికార్డింగ్ రూమ్‌లో సీన్లు చూస్తూ నిద్రపోయినట్టుగా ఉన్నాడు. ఎంతో గొప్ప ఎడిటర్ అయిన శ్రీకర ప్రసాద్ కూడా ఈ సాగదీత కథను అలా పేర్చుకుంటూ పోయారే తప్పా ట్రిమ్ చేయలేదు. ఇందుకు ఆయనను ఎంత మాత్రం తప్పుపట్టలేం… కొరటాల సాగదీత సీన్లే సినిమాను కుందేలు నడకగా మార్చేశాయి. ఆర్ట్ వర్క్ జస్ట్ ఓకే.. సముద్రం సెట్ చాలా క్లోజప్ షాట్‌లో లేపేశారు.. ఇంత పెద్ద కథకు వేసిన సముద్రం సెట్ ఓ అర ఎకరం కూడా లేదంటే వీళ్లు ఎంత గొప్పగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన ఆర్ట్ వర్క్ గురించి గొప్పగా చెప్పలేం. యాక్షన్ సీన్లలో వర చేసే ఫైట్ సినిమాకు హైలెట్.. ఫస్టాఫ్‌లో వచ్చే సైప్.. దేవర ఫైట్ కూడా గొప్పగా డిజైన్ చేయలేదు. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఓకే… భారీ తాగరణంతో పాటు కొరటాల గట్టిగా ఖర్చు పెట్టించాడు.
కొరటాల డైరెక్షన్ కట్స్ :
కొరటాల శివ ఈ కథను రెండు పార్టులుగా తీయాలని అంతరాత్మలో చేసుకున్న మోసంతోనే దేవర ట్రాక్ తప్పేసింది. మామూలుగానే కొరటాల స్క్రీన్ ప్లేలో జోష్… ఉండదు. ఇక నీరసపు స్క్రీన్ ప్లేతో నత్త నడక కథనంతో.. సాగదీస్తూ సినిమా చూస్తున్న ప్రేక్షకుడి సహనానికి పెద్ద పరీక్ష పెట్టాడు. కనీసం కొరటాల చెప్పే మాటలు… కోసే కోతల్లో పావలా వంతు కూడా సినిమాతో ప్రేక్షకులను ఎలా రంజింప చేయాలనే విషయంపై దృష్టి పెట్టలేదు. కనీసం కథ, కథనాల్లో నాలుగు మంచి సీన్లు చూద్దామంటే భూతద్దంలో పెట్టి వెతికినా లేవు… కనీసం ఎన్టీఆర్ క్యారెక్టర్‌కు కొన్ని పవర్ ఫుల్ డైలాగులు రాసి విజిల్స్ మూమెంట్ కూడా ఇవ్వలేదు.. ఎన్టీఆర్ అనే కాదు.. ఏ పాత్రకు సరైన డైలాగులు లేవు… కొరటాల పెన్నులో ఇంకు అయిపోయిందో.. ఆచార్య దెబ్బకు బ్రెయిన్ దొబ్బిందో అర్థం కాలేదు.
ప్లస్ పాయింట్స్ ( + ) :
– ఎన్టీఆర్‌ను చాలా రోజుల తర్వాత తెరమీద చూడడం
-జాన్వీ కపూర్‌ను ఫస్ట్ టైం తెరమీద చూడడం
– అక్కడక్కడా అనిరుధ్ మ్యూజిక్
మైనస్ పాయింట్స్ ( – ) :
– ఈ సినిమాకు ఒకటి నుంచి 10 మైనస్‌లు కొరటాల శివే
– రొటీన్ స్టోరీ.. రొటీన్ ఫ్లాట్.. రొటీన్ డైలాగులు
– ఫస్టాఫ్
ఫైనల్‌గా…
ఫైనల్‌గా చెప్పుకోవడానికేం లేదు… దేవర ఆడాలంటే అద్భుతం జరగాలి.. ఆ అద్భుతం ఏమవ్వాలంటే ఐదున్నరేళ్ల తర్వాత ఎన్టీఆర్‌ను సోలోగా చూద్దాం అని ప్రతి ఒక్కరు టాక్‌తో సంబంధం లేకుండా థియేటర్లకు పోలోమని రావాలి… అది జరుగుతుందా ? దేవర హిట్ అవుతుందా ? అన్న ప్రశ్నకు ప్రస్తుతానికి దేవుడి దగ్గరే ఆన్సర్ ఉంది.. దేవుడా దేవరను కాపాడు..!
దేవర ఫైనల్ పంచ్ : దేవర నిజం చెప్పాలంటే దారులు కనపడలేదు
దేవర TL రేటింగ్: 2.5 / 5