తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో చిరు స్టార్ హోదాను సంపాదించుకున్నారు. సుధీర్గ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. మరెన్నో రికార్డులు కొల్లగొట్టారు. కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు. ఆరు పదుల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్న చిరంజీవి కెరీర్ లో కేవలం 29 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఏకైక చిత్రం ఏదో తెలుసా.. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య. 80వ దశకంలో వచ్చిన చిత్రమిది.
నిజానికి అప్పట్లో ఒక్కో సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి 150 నుంచి 200 రోజుల సమయం పట్టేది. అలాంటి రోజుల్లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను 29 రోజుల్లో చిత్రీకరించి డైరెక్టర్ కోడి రామకృష్ణ అందరి చేత ఔరా అనిపించారు. గొల్లపూడి మారుతీరావు డైలాగ్స్ అందించిన ఈ చిత్రంలో చిరంజీవి, మాధవి జంటగా నటించారు. పూర్ణిమ, గొల్లపూడి మారుతీరావు, సంగీత, పి. ఎల్. నారాయణ, అన్నపూర్ణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కె.రాఘవ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాను నిర్మించగా.. జె.వి.రాఘవులు సంగీతం అందించారు. 1982లో రిలీజ్ అయిన ఈ సినిమా.. యావరేజ్ టాక్ తో మొదలై సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. 8 కేంద్రాలలో 50 రోజులు మరియు రెండు కేంద్రాల్లో 100 రోజుల రన్ సాధించింది. ఆపై షిఫ్ట్లతో ఉదయం ఆటలు ఆడుతూ 517 రోజుల రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఇంట్లో భార్య పై ప్రేమని చూపిస్తూనే.. ఇంటి బయట అడుగు పెట్టగానే మరో స్త్రీ కోసం వెంపర్లాడే మగాడి జీవితాన్ని ప్రధాన కథాంశంగా తీసుకుని ఈ మూవీని తెరకెక్కించారు.
కోడి రామకృష్ణకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం కాగా.. గొల్లపూడి మారుతీరావు మాటల రచయిత నుంచి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతోనే నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఎక్కువ భాగం షూటింగ్ పాలకొల్లు పరిసరాల్లోనే జరిగింది. అలాగే క్లైమాక్స్‌ని చిరంజీవి ఇంట్లోనే కాకుండా అంతర్వేదిపాలెంలో చిత్రీకరించారు. రూ. 3.20 లక్షల బడ్జెట్ తో 29 రోజుల్లో పూర్తి చేయబడిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.