సినీ పరిశ్రమలో కథలు చేతులు మారడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఒక హీరోకి నచ్చని కథతో మరొక హీరో సినిమా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోలు కాదన్న కథతో నరసింహ నందమూరి బాలకృష్ణ సినిమా చేశారు. ఆ సినిమా పేరు కథానాయకుడు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకు కె. మురళీమోహనరావు దర్శకత్వం వహించారు.
బాలకృష్ణ, విజయశాంతి జంటగా నటించగా.. ఒక ముఖ్యమైన పాత్రను శారద పోషించారు. కె. చక్రవర్తి సంగీతం అందించారు. 1984 కథానాయకుడు విడుదలైంది. అయితే ఈ సినిమాను డైరెక్టర్ మురళీమోహనరావు మొదట మెగాస్టార్ చిరంజీవితో చేయాలని భావించారు. ఎందుకంటే ఆయన అంతకు ముందు చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్ లో సంఘర్షణ అనే సూపర్ హిట్ సినిమా తీశారు. చిరంజీవితో ఉన్న సన్నిహిత్యం నేపథ్యంలో.. ఒకరోజు ఆయన్నకు కథానాయకుడు స్టోరీని మురళీమోహనరావు నెరేట్ చేశాయి.
అయితే కథలో హీరో పాత్రకంటే శారద పాత్రకే అధిక ప్రాధాన్యత ఉండటంతో చిరంజీవి సున్నితంగా నో చెప్పారు. ఆ తర్వాత ఇదే స్టోరీని సూపర్ స్టార్ కృష్ణ వద్దకు తీసుకెళ్లగా.. ఆయన కూడా సినిమా చేసేందుకు ముందుకు రాలేదు. కృష్ణ వద్దన్నాక డైరెక్టర్ మురళీమోహనరావు.. సుమన్, కృష్ణం రాజు, రమేష్ బాబు వంటి హీరోలను సంప్రదించారు. వారిలో ఏ ఒక్కరూ ఎస్ చెప్పలేదు. ఇక ఆఖరి ప్రయత్నంగా మురళీమోహనరావు బాలకృష్ణ వద్దకు వెళ్లారు.
ఆయన కూడా నో అంటే కథను పక్కన పడేద్దామని భావించారు. కానీ అనూహ్యంగా బాలకృష్ణకు స్టోరీ బాగా నచ్చి థైర్యంగా సినిమా చేసేందుకు ముందు వచ్చారు. 1984లో పట్టాలెక్కిన కథానాయకుడు.. అదే ఏడాది డిసెంబర్ 18న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రాన్ని హిందీలో దిల్వాలా (1986) పేరుతో రీమేక్ కూడా చేయడం మరొక విశేషం.