MoviesTL రివ్యూ : స‌రిపోదా శ‌నివారం … ఇది హిట్టు బొమ్మ...

TL రివ్యూ : స‌రిపోదా శ‌నివారం … ఇది హిట్టు బొమ్మ అంటే

ప‌రిచ‌యం :
నేచురల్ స్టార్ నాని గత ఏడాది దస‌రా లాంటి మాస్ మూవీ – హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా నాని మాస్ క్లాస్ మిక్స్ చేసుకొని సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను త్రిబుల్ ఆర్ నిర్మాత డివిడి దానయ్య నిర్మించారు. ఈరోజు భారీ అంచనాల మధ్య ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో లేదో TL స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ :
సూర్య ( నాని ) కి చిన్నప్పటి నుంచి కోపం చాలా ఎక్కువ.. ఆ కోపాన్ని అదుపులో పెట్టడం కోసం అతడి తల్లి ఛాయాదేవి ( అభిరామి ) ఓ మాట తీసుకుంటుంది. ఎంత కోపం వచ్చినా ఒక శనివారం మాత్రమే ఆ కోపానికి కారణమైన వాళ్ళ పని పట్టాలి.. మిగిలిన వారం అంతా సైలెంట్ గా ఉండాలి. సూర్య‌ తండ్రి ( సాయికుమార్ ) అక్క ( అదితి ) ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మంచి ఉద్యోగిగా పేరు తెచ్చుకున్న సూర్య క‌థ‌లోకి సీఐ దయానంద్ (ఎస్‌.జె సూర్య ) చేరతాడు. తన సొంత అన్న కుర్మానంద్ ( మురళిశ‌ర్మ ) తో వైరమున్న సిఐ దయానంద్ ఎవరు అతని కథ ఏమిటి ? సోకులపాలెంఅనే ఊరికి దయానంద్‌కు ఉన్న సంబంధం ఏంటి ? దయానంద్‌పై సూర్యకి ఉన్న కోపం సోకులపాలేనికి ఎలాంటి మేలు చేసింది.. వీళ్ళ స్టోరీలోకి చారులత ( ప్రియాంక మోహన్ ) ఎలా ప్రవేశించింది అన్నదే మిగిలిన కథ.

విశ్లేష‌ణ :
వివేక్ ఆత్రేయ అంటేనే తనదైన మార్క్‌ తెలివైన కథనంతో సినిమాను నడిపిస్తాడు. ఇది కూడా ఓ యాక్ష‌న్‌ డ్రామా. సినిమా రిలీజ్‌కు ముందే కథ కంటే ఆ కథను ఎలా చెప్పాం ? అన్నదే మీరు చూడాలి అంటూ యూనిట్ ప్రచారం చేసింది. వైవిధ్యమైన కథనాన్ని జోడించి సినిమాను దర్శకుడు నడిపాడు. ఏ కథ‌ అయినా అమ్మనుంచే మొదలవుతుందంటూ.. అమ్మ ఆమె తన కొడుకు నుంచి తీసుకునే మాటతో ఈ సినిమా ప్రారంభం అవుతుంది. సినిమా ప్రారంభంలో కాస్త స్లోగా ఉన్నా ద‌యాపాత్ర ప్రవేశంతో కథ ఊపందుకుంటుంది. సినిమా మలుపులు తిరుగుతూ ఆసక్తిగా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలోనే పరిచయమయ్యే చారులత – కూర్మానందం పాత్రలు వాటి ద్వారానే అన్నదమ్ముల మధ్య సంఘర్షణ… సోకులపాలెం కథలు ప్రేక్షకుడని సినిమాలో విలీనం అయ్యేలా చేస్తాయి.

సూర్య – చారులత‌ ప్రేమ కథలో వచ్చే ఈగ స్టోరీ అల‌రిస్తుంది. సినిమాలో కీలకమైన ప్రతిపాత్ర వెనక ఓ కథ ఉంటుంది.. ఆ కథలను వివరించే క్రమంలో సినిమా కొంత సాగదీసిన భావన కలుగుతుంది. సూర్య – చారులత‌తో దగ్గరయ్య సన్నివేశాలు చారుత‌ల‌కు సూర్య తన శనివారం సంగతి చెప్పాలనుకోవడం.. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు.. ఇంటర్వెల్ బ్యాంగ్‌ సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచాయి. అప్పటినుంచి కదా సూర్య వర్సెస్ దయా అన్నట్టుగా మారిపోతుంది. ఇక సోకులపాలెంలో ధైర్యం నింపడం కోసం సూర్య – చారుల‌త కలిసి వేసే ప్రణాళికలు అనూహ్యంగా చోటు చేసుకునే సంఘటనలు… కోపం నలుగురిలో ధైర్యాన్ని నింపేలా ఉండాలంటూ క్లైమాక్స్ దిశ‌గా సినిమా సాగ‌డం బాగుంది.

అయితే రెండు గంటల 54 నిమిషాలుపాటు సినిమా సాగటం వల్ల సినిమా చాలావరకు సాగ‌దీసిన భావన కలుగుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్‌లో సరిపోదా శనివారం అనూహ్యంగా డీవియేట్ అయిన భావన కూడా కలుగుతుంది. దర్శకుడు నేరుగా క్లైమాక్స్ కు వెళ్ళిపోకుండా కొన్ని అనవసర సీన్లతో టైం వేస్ట్ చేశాడు.. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసినట్టుగానే ఉంటుంది. ఏది ఏమైనా సినిమా చాలా చోట్ల స్లో అయినా వాటిని మరిపించే పాజిటివ్ విషయాలు చాలా ఉన్నాయి. కొత్తదనాన్ని… మాస్ అంశాలను బ్యాలెన్స్ చేస్తూ సాగిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. సినిమాలో నాని యాక్షన్ అవతారం అదిరిపోయింది.. సూర్య పాత్రలో ఒదిగిపోయాడు.. ఉద్యోగిగా సహజసిద్ధమైన లుక్ నటనతో అలరిస్తూనే మరోవైపు కోపంతో రగిలిపోయే కోణం ప్రదర్శించాడు.

విలన్ ఎస్‌.జె సూర్య ఇన్స్పెక్టర్ దయానంద్‌ పాత్ర సినిమాకి కీలకం.. క్రూరత్వం ప్రదర్శిస్తూ తన చూపులతో భయపెడతాడు.. ఇంకా చెప్పాలంటే కొన్నిచోట్ల నాని కంటే నటనతో తన డామినేషన్ చూపించాడు. చారులత‌ పాత్రలో ప్రియాంక మోహన్ పర్వాలేదు అనిపిస్తుంది. ఆమె పాత్రకు మరీ అంత ప్ర‌యార్టీ లేదు. ఇక నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పే అంటూ మురళీశ‌ర్మ తెరపై కనిపించిన విధానం బాగుంది.. ఆ పాత్ర సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్.. సాయికుమార్ – అదితి బాలన్ – అభిరామి – హర్షవర్ధన్ – అజయ్ తమ పాత్రల వరకు న్యాయం చేశారు.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే..
టెక్నికల్ గా చూస్తే సినిమా చాలా ఉన్నతంగా ఉంది. నేపథ్య సంగీతం సినిమాపై బలమైన ప్రభావం చూపించింది. ఎడిటింగ్ మాత్రం చాలా సాగదీసినట్టుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. దర్శకుడు వివేక్ ఆత్రేయ తన మార్క్‌ యాక్షన్ ప్రధానమైన సినిమా ఎలా ఉంటుందో ఈ సినిమాతో చూపించాడు. పాత్రల రచన.. కథాను మలిచిన తీరు సినిమాకి హైలైట్. సినిమాలో నాని యాక్షన్ అవతారం.. ఎస్ జె సూర్య నటన.. కథనం.. సంగీతం బాగుంటే.. కొన్ని సన్నివేశాలలో స్వాగ‌దీత‌.. ఊహ కందేలా సాగే కథ‌ మైనస్. ఓవ‌రాల్‌గా సినిమా ఖ‌చ్చితంగా చూడొచ్చు.

ఫైన‌ల్ పంచ్ :
సరిపోయింది శ‌నివారం

స‌రిపోదా శ‌నివారం రేటింగ్ : 3 / 5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news