బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మల్లో సోనాలి బింద్రే ఒకరు. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ.. గతంలో సోనాలి బింద్రే నటించిన చిత్రాలు వరుసగా థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఇటీవల మహేష్ బాబు, సోనాలి బింద్రే జంటగా నటించిన మురారి మూవీ రీ రిలీజ్ అయ్యి రికార్డులు తిరగరాసింది. ఇక ఇప్పుడు ఇంద్ర వంతు వచ్చింది.
ఫ్యాక్షనిజం నేపథ్యంలో బి.గోపాల్ తెరకెక్కించిన ఇంద్ర సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ నటించారు. అశ్వనీదత్ నిర్మాతగా వ్యవహరించారు. 2002లో విడుదలైన ఇంద్ర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. రూ. 10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. ఫుల్ రన్ లో రూ. 55 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.
మొదటి వారంలో రూ. 20 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. అయితే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఇంద్ర సినిమాను గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే బుక్కింగ్స్ కూడా ఊపందుకున్నాయి. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఇంద్ర మూవీ విశేషాలను హీరోయిన్ సోనాలి బింద్రే గుర్తుచేసుకున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవిపై ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. ఇంద్ర మూవీలో నాకు అన్నిటికంట కష్టమైన పని ఆయనతో కలిసి డాన్స్ చేయడమే. ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. దాయి దాయి దామా పాట షూటింగ్ ఉందని కాల్ చేసి చెప్పారు. అంతే చిత్రీకరణకు ముందు రోజు రాత్రి భయంతో నిద్ర కూడా పోలేదు. ఆ సాంగ్ లో చిరంజీవి అద్భుతంగా చేశారు. నన్నెక్కడ వీణ స్టెప్ చేయమంటారో అని తెగ టెన్షన్ పడ్డాను అంటూ సోనాలి బింద్రే సరదాగా చెప్పుకొచ్చింది. అలాగే ఇంద్ర మూవీని మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడటానికి ఆసక్తిగా ఉన్నట్లు కూడా సోనాలి బింద్రే తెలిపారు.