యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ యమదొంగ. సీనియర్ ఎన్టీఆర్ నటించిన యమగోల ప్రేరణతో యమదొంగ సినిమాను తీశారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కు జోడిగా ప్రియమణి యాక్ట్ చేస్తే.. కథలో కీలకమైన యమ ధర్మరాజు పాత్రను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోషించారు. మమతా మోహన్‌దాస్, జయప్రకాష్ రెడ్డి, ఎం. ఎస్. నారాయణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు.
విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 18 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన యమదొంగ సినిమా.. 2007 ఆగస్టు 15న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది. అప్పట్లో ప్రేక్షకులకు యమదొంగ మూవీ ఒక విజువల్ ట్రీట్‌లా అనిపించింది. ఇకపోతే ఈ చిత్రంలో యముడు పాత్రను మోహన్ బాబు ఎంత అద్భుతంగా పోషించారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అటు ఎన్టీఆర్ ఇటు మోహన్ బాబు.. ఇద్దరూ తమ పాత్రల్లో జీవించేశారు. సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. యమదొంగ లో యముడి క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ మోహన్ బాబు కాదు. డైరెక్టర్ రాజమౌళి మొదట ఆ పాత్ర కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణను సంప్రదించారట. ఎందుకంటే, తెలుగు ప్రేక్షకులకు యముడు అంటే టక్కున గుర్తొచ్చేది కైకాలనే.
అంతలా ఆయన యముడు వేషధారిగా మాయ చేసారు. తన నటనా ప్రతిభతో యముడంటే ఇలానే ఉంటాడేమో అనుకునేంతలా మెప్పించారు. అనేక చిత్రాల్లో కైకాల యమ ధర్మరాజుగా చేశారు. సీనియర్ ఎన్టీఆర్ యమగోలలోనూ ఆయనే యముడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమా యమదొంగ లో కూడా కైకలనే యముడిగా నటించమని కోరారట. అయితే పారితోషికం విషయంలో తేడా రావడం వల్ల యమదొంగలో తాను నటించలేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ స్వయంగా వెల్లడించారు. ఇక ఆయన రిజెక్ట్ చేయడంతో యమదొంగలో యముడిగా చేసే గోల్డెన్ ఛాన్స్ మోహన్ బాబును వరించింది.