ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినా.. తనదైన ప్రతిభ, స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన తెలుగు నటుల్లో నాని ఒకడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన నాని.. ఆ తర్వాత హీరోగా మారాడు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. కథల ఎంపికలో తన ప్రత్యేకత చాటుకుంటూ కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. స్టార్ హోదాను అందుకున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు.
అయితే ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇటీవల యూసఫ్‌గూడలోని బెటాలియన్‌లో శిక్షణ పొందుతున్న పోలీసులను నాని కలిశాడు. వారితో కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలోనే ట్రైనీ కానిస్టేబుల్స్ అడిగిన ప్రశ్నలకు నాని తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చాడు. అయితే ఒకతను మీరు హీరో కాకపోయుంటే ఏమి అయ్యేవారు? అని ప్రశ్నించగా.. నాని పోలీస్ అయ్యే వాడినని నవ్వేశాడు.
ఆ తర్వాత తన మనసులో మాటను బయటపెట్టాడు. హీరో కాకపోతే కచ్చితంగా థియేటర్ లో ప్రొజెక్టర్ ఆపరేటర్ గా పని చేస్తూ ఉండేవాడినని నాని చెప్పుకొచ్చాడు. అలాగే ఫిట్నెస్ రహస్యం గురించి అడడగా.. పెద్దగా డైట్స్ ఫాలో అవ్వనని, అమ్మ వండిన అన్ని వంటలు తింటానని నాని పేర్కొన్నాడు. దీంతో ఆయన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
కాగా, దసరా, హాయ్ నాన్న చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచి జోష్ లో ఉన్న నాని.. త్వరలో సరిపోదా శనివారం మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా నటించాడు. ఆగస్టు 29న సరిపోదా శనివారం తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్స్ కూడా చిత్రబృందం ప్రారంభించింది.