ఆర్ఆర్ఆర్ వంటి బిగ్గెస్ట్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రం దేవర. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్ గా యాక్ట్ చేయగా.. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా రూ. 300 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు.
రీసెంట్ గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ప్రమోషన్స్ షురూ కానున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా దేవర చిత్రానికి మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతోంది. తాజాగా ఓవర్సీస్ లో దేవర థియేట్రికల్ రైట్స్ ను హంసినీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్లు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని హంసినీ ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. దేవర ఓవర్సీస్ రైట్స్ రూ. 27 కోట్లు పలికినట్లు బలంగా టాక్ నడుస్తోంది. ఈ లెక్కన 5.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబడితే అక్కడ ఎన్టీఆర్ మూవీ సేఫ్ జోన్లోకి వెళ్తుంది.
ఇకపోతే దేవర తెలుగు రైట్స్ ఇప్పటికే అమ్ముడు పోయాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ. 115 కోట్లకు దక్కించుకున్నారు. అలాగే నార్త్ లో రూ. 45 కోట్లకు డీల్ క్లోజ్ అయింది. బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ దేవర హిందీ థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. దేవర థియేట్రికల్ బిజినెస్ రూ. 200 కోట్లకు పైగా జరిగింది. ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రూ.155 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర చిత్రం రిలీజ్ కి ముందే భారీ లాభాలను సొంతం చేసుకుంది. మరి రిలీజ్ తర్వాత ఎటువంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.