బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు త్వరలో ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 8న లేటెస్ట్ సీజన్ ను స్టార్ట్ చేసేందుకు నిర్వాహకులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వరుసగా ప్రోమోలు వదలడం ప్రారంభించారు. గత నాలుగు సీజన్ల నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న కింగ్ నాగార్జుననే సీజన్ 8 ను కూడా ముందుండి నడిపించబోతున్నారు.
ఇక ఎప్పట్లాగానే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ పలువురు సీరియల్ యాక్టర్స్, జబర్దస్త్ కమెడియన్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్ల పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఈ జాబితాలో ఓ నందమూరి హీరో పేరు వచ్చి చేరడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు చైతన్య కృష్ణ.
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పెద్ద కుమారుడు జయకృష్ణ వారసుడే చైతన్య కృష్ణ. జగపతిబాబు హీరోగా తెరకెక్కిన ధమ్(2003) అనే సినిమాతో చైతన్య కృష్ణ వెండితెరపై అడుగుపెట్టాడు. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మధ్యలో కొన్నాళ్లు పాలిటిక్స్ లో కనిపించారు. అయితే నటనపై ప్రేమ తగ్గకపోవడంతో చైతన్య కృష్ణ లేటు వయసులో హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.
దాదాపు రెండు దశాబ్దాల అనంతరం గత ఏడాది బ్రీత్ అనే మెడికల్ మాఫియా థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వెండితెరపై సక్సెస్ అవ్వలేకపోయిన చైతన్య కృష్ణ.. బిగ్ బాస్ షో ద్వారా తెలుగు వారికి దగ్గర కావాలని ఆశపడుతున్నాడట. అందులో భాగంగానే సీజన్ 8 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అయ్యాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.