ఒకప్పటి హీరోయిన్ సంగీతను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలనచిత్ర నిర్మాణ కెఆర్ బాలన్ మనవరాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగీత.. మొదట మలయాళ, తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంది. 2002లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం మూవీ సంగీతకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత పెళ్ళాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఓరి నీ ప్రేమ బంగారం కానుతో సహా చాలా చిత్రాల్లో సంగీత నటించి మెప్పించింది.
2008 వరకు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్ గా సత్తా చాటింది. ఆ తర్వాత పెళ్లి కావడంతో సంగీతకు హీరోయిన్ ఛాన్సులు తగ్గుతూ వచ్చాయి. దాంతో ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అమ్మ పాత్రలతో పాటు బలమైన సహాయక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. సంగీత వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2009 లో ఆమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
సంగీత భర్త పేరు క్రిష్. పెద్దలను ఎదురించి తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరార్ ఆలయంలో క్రిష్, సంగీత ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం ఇరు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఒకదశలో మనస్పర్థల కారణంగా క్రిష్, సంగీత విడాకులు కూడా తీసుకోవాలనుకున్నారు. కానీ కొన్ని రోజులకి ఒకరినొకరు అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు. తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
ఈ దంపతులకు 2012లో శివియా అనే కూతురు జన్మించింది. ఇకపోతే సంగీత భర్త క్రిష్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడే. అతను తమిళ్ మరియు తెలుగు భాషా చిత్రాల్లో పనిచేసిన నేపథ్య గాయకుడు మరియు నటుడు. పలు చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించిన క్రిష్.. 2015 లో పురియధ ఆనందం పుతితగ ఆరంభం అనే కోలీవుడ్ మూవీలో హీరోగా కూడా చేశాడు. అయితే సింగర్ గా సక్సెస్ అయిన రేంజ్ లో నటుడిగా కాలేకపోయాడు.