మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం అతడు విడుదలై తాజాగా 19 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అతడు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ను ఇప్పుడు తెలుసుకుందాం. నిజం, నాని, అర్జున్ చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న మహేష్ బాబు.. అతడుతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చెన్నై సోయగం త్రిష హీరోయిన్ గా యాక్ట్ చేసింది.
సోనూ సూద్, ప్రకాష్ రాజ్, నాజర్, సునీల్, సాయాజీ షిండే, కోట శ్రీనివాసరావు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. మణిశర్మ సంగీతం అందించారు. మురళీ మోహన్ సమర్పణలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై దుగ్గిరాల కిషోర్, ఎం. రామ్ మోహన్ కలిసి నిర్మించిన అతడు సినిమా 2005 ఆగస్టు 10న విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
అలాగే ఈ చిత్రం మూడు నంది అవార్డులు మరియు ఉత్తమ దర్శకుడి విభాగంలో దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. తమిళ్, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రీమేక్ కూడా చేయబడింది. ఇకపోతే అతడు సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదు. త్రివిక్రమ్ మొదట పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాను తీయాలని అనుకున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ తీసుకుని త్రివిక్రమ్ కథ చెప్పడం ప్రారంభించారు.
అయితే త్రివిక్రమ్ నెరేషన్ స్టార్ట్ చేసిన అరగంటకే పవన్ నిద్రలోకి జారుకున్నారు. ఆ తర్వాత కథ నచ్చలేదని త్రివిక్రమ్ కు పవన్ నో చెప్పారు. గతంలో ఈ విషయాన్ని త్రివిక్రమ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ రిజెక్ట్ చేయడంలో త్రివిక్రమ్ మహేష్ బాబు వద్దకు వెళ్లారు. ఆయన చాలా ఆసక్తితో విని, నచ్చి సినిమాలో నటించారు. క్రేజీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అతడు మూవీలో 60 ఏళ్ళు దాటిన సత్యనారాయణమూర్తి అనే ముఖ్యమైన పాత్రను అలనాటి హీరో శోభన్ బాబుతో చేయించాలని నిర్మాత మురళీమోహన్ ఆశించారు. అందుకోసం ఆయనకు బ్లాంక్ చెక్ ని కూడా పంపారు. కానీ శోభన్ బాబు మాత్రం రీఎంట్రీకి నిరాకరించారు. అందువల్ల ఆ పాత్ర చేసే అవకాశం నాజర్ కు దక్కింది.