టాలీవుడ్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ లో వెన్నెల కిషోర్ ఒకరు. తనదైన హావభావాలు, కామెడీ టైమింగ్ తో వెన్నెల కిషోర్ చాలా తక్కువ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బ్రహ్మానందం గారు సినిమాలు చేయడం తగ్గించేశాక.. అటు స్టార్ హీరోలకు, ఇటు యంగ్ హీరోలకు వెన్నెల కిషోర్ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా మారాడు. ముఖ్యంగా 2022 నుంచి వెన్నెల కిషోర్ కి భారీ డిమాండ్ ఏర్పడింది. ఏడాదికి ఈయన పది నుంచి ఇరవై చిత్రాల్లో నటిస్తున్నాడు.
ఈమధ్య చార్లీ 111 మూవీతో హీరోగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. థియేటర్లో ఈ చిత్రం సరిగ్గా ఆడకపోయినా.. ఓటీటీలోకి మాత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ మెయింటైన్ చేస్తున్న వెన్నెల కిషోర్.. సినిమాల్లోకి రాకముందు ఎక్కడ ఉద్యోగం చేశాడో తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తెలంగాణలోని కామారెడ్డిలో పుట్టి పెరిగిన కిషోర్.. పదో తరగతి దాకా సొంతూరులోనే చదువుకున్నాడు.
హైదరాబాదులో ఇంటర్, డిగ్రీ కంప్లీట్ చేశాడు. జీఆర్ఈ, టోఫెల్ లో మంచి స్కోర్ సంపాదించిన కిషోర్.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. మిచిగాన్‌లోని ఫెర్రిస్ స్టేట్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి.. వర్జీనియాలోని థామ్సన్ ఫైనాన్స్ సంస్థలో సాఫ్ట్వేర్ టెస్టర్ గా ఉద్యోగం సంపాదించాడు. జాబ్ చేస్తూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో కిషోర్ అనుకోకుండా రంగుల ప్రపంచం వైపు అడుగులు వేశాడు. అమెరికాలో డైరెక్టర్ దేవ కట్టా వెన్నెల అనే సినిమాను తీస్తున్నాడని తెలుసుకున్న కిషోర్.. ఆయన వద్ద సహాయకుడిగా పనిచేయడానికి వెళ్ళాడు. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ మిచిగాన్‌లో జరుపుకుంది.
అయితే వెన్నెల సినిమాలో ఖాదర్ పాత్రలో నటించాల్సిన శివా రెడ్డికి వీసా సమస్య తలెత్తడంతో.. ఆ పాత్రను కిషోర్ చేశాడు. వర్జీనియాలో ఎన్నారైలకు నెల జీతంతో కూడిన సెలవు ఇచ్చేవారు. ఆ సెలవును వాడుకుని కిషోర్ వెన్నెల సినిమా చేశాడు. 2005లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించడంతో.. కిషోర్ కు మరికొన్ని సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ మూడేళ్లు ఏ సినిమాకు ఒప్పుకోలేదు. ఉద్యోగం చేసుకుంటూ పద్మజ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకున్నాడు. ఆపై అమ్మ కోరిక మేరకు ఇండియాకు వచ్చేశాడు. ఇక్కడికి రాగానే కిషోర్ కు మరిన్ని ఛాన్సులు రావడంతో ఉద్యోగం మానేసి పూర్తి స్థాయి నటుడిగా మారాడు. తన తొలి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని వెన్నెల కిషోర్ గా ప్రసిద్ధి చెందాడు. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ కమెడియన్ గా ఎదిగాడు.