ఒకప్పటి స్టార్ హీరోయిన్ దేవయానిని సౌత్ సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముంబైలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన దేవయాని.. ఆర్థిక పరిస్థితుల కారణంగా పదవ తరగతి తోనే చదువులకు పులిస్టాప్ పెట్టి సినిమా రంగం వైపు అడుగులు వేసింది. బెంగాలీ మూవీతో తన నటన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ, తమిళ చిత్ర పరిశ్రమల్లోకి ప్రవేశించింది. కోలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా దేవయాని ముద్ర వేయించుకుంది. తమిళ అగ్ర హీరోలతో ఆడిపడింది.
1998లో సుస్వాగతం మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. భీమినేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ రొమాంటిక్ డ్రామాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడి దేవయాని నటించిన ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఆ తర్వాత తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో మాత్రం బిజీ హీరోయిన్ గా సత్తా చాటింది. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే దేవయాని కోలీవుడ్ డైరెక్టర్ రాజకుమారన్ తో ప్రేమలో పడింది.
అయితే వీరి ప్రేమను దేవయాని తల్లిదండ్రులు అంగీకరించలేదు. దాంతో 2001లో ఇంట్లో నుంచి పారిపోయి ఒక గుడిలో రాజకుమారన్ ను దేవయాని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. పెళ్లి తర్వాత దేవయాని కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో సహాయక నటిగా మారింది. చెన్నకేశవరెడ్డి, నాని, ఆయనే మా ఆయన, లవ్ స్టోరీ, రొమాంటిక్, జనతా గ్యారేజ్ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో దేవయాని 100కి పైగా సినిమాల్లో పని చేసింది. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించింది.
కొన్ని తమిళ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించి చేతులు కాల్చుకుంది. ప్రస్తుతం అడపా తడపా చిత్రాలతో దేవయాని తన యాక్టింగ్ కెరీర్ ను సాగిస్తోంది. మరోవైపు తమిళనాడులోని స్థానిక అన్నాసాలైలో చర్చ్ పార్క్ కాన్వెంట్ స్కూల్లో టీచర్ గా కూడా దేవయాని వర్క్ చేస్తుండటం విశేషం. ఇకపోతే దేవయానికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద అమ్మాయి పేరు ఇనియా కాగా.. చిన్న అమ్మాయి ప్రియాంక. తల్లికే పోటీ ఇచ్చేంత అందంగా దేవయాని కూతుళ్లు ఉంటారు. ఇనయా, ప్రియాంక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో..దేవయానికి ఇంత అందమైన కూతుళ్లు ఉన్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.