ఈ మధ్య కాలంలో బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన తెలుగు చిత్రం కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ హీరోగా మైథాలజీ కాన్సెప్ట్‌తో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలను పోషించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు.
ప్రపంచవ్యాప్తంగా 2024 జూన్ 27న ఐమ్యాక్స్, 3డి, ఇతర ఫార్మాట్లలో విడుదలైన కల్కి చిత్రం పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ. 1048.60 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన 7వ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇకపోతే ఈ చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా సుప్రీమ్ యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మున్నెప్పుడూ చూడని డిఫరెంట్ లుక్ లో కమల్ హాసన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. కల్కి తొలి భాగంలో ఆయన పాత్రకు నిడివి తక్కువే ఉన్నప్పటికీ.. రెండో భాగంలో మాత్రం కీలకంగా ఉండబోతోందని నాగ్ అశ్విన్ క్లైమాక్స్ లో హింట్ ఇచ్చారు. అయితే సుప్రీమ్ యాస్కిన్ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆలస్యంగా బయటకు వచ్చింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ యాస్కిన్ పాత్ర కోసం కమల్ హాసన్ ను సంప్రదించినప్పుడు.. మొదట ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వలేదట. కొంత సమయం కావాలని అడిగారట.
దాంతో నాగ్ అశ్విన్ ఆలోచనలో పడ్డాడు. ఒకవేళ కమల్ హాసన్ నో చెబితే ఆ పాత్రకు మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ను సంప్రదించాలని భావించారట. కానీ అనూహ్యంగా కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిత్ర బృందం కూడా ఆయనకే ఓటేశారు. అలా మోహన్ లాల్ కల్కి మూవీని మిస్ చేసుకున్నారు. యాస్కిన్ పాత్రను కమల్ రిజెక్ట్ చేసుంటే.. కచ్చితంగా అది మోహన్ లాల్ కే దక్కేందని తాజాగా చిత్ర బృందంలోని ఓ వ్యక్తి యూట్యూబ్ ఇంటర్వ్యూలో తెలియజేశాడు.