దేశం గర్విందగ్గ దర్శకుడు, తెలుగు జాతి కీర్తిని ప్రపంచస్థాయిలో చాటిచెప్పిన అసాధ్యుడు రాజమౌళిపై ఇటీవల దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించిన సంగతి తెలిసిందే. మోడ్రన్ మాస్టర్స్ టైటిల్ తో రాఘవ్ ఖన్నా తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రాజమౌళి సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, రానా, కీరవాణి, విజయేంద్ర ప్రసాద్, రమా రాజమౌళితో సహా పలువురు స్టార్స్ రాజమౌళికి సంబంధించి ఎన్నో ఆసక్తికర సంగతులను పంచుకున్నారు. ఈ క్రమంలోనే రాజమౌళి చిన్నతనంలో కృష్ణుడిగా ఓ సినిమాలో యాక్ట్ చేశాడన్న విషయాన్ని ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ డాక్యుమెంటరీలో తెలియజేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు పిల్లన గ్రోవి.
కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ కలిసి ఈ సినిమాను ప్రారంభించారు. విజయేంద్ర ప్రసాద్ నిర్మాత కాగా.. శివశక్తి దత్తా డైరక్టర్. ఓ సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నేపథ్యంలో చిన్న పిల్లల చుట్టూ తిరుగుతూ పిల్లన గ్రోవి కథ సాగుతుంది. కథకు ప్రాణమైన బాలకృష్ణుడి పాత్రకు బొద్దుగా ఉండే రాజమౌళిని ఎంపిక చేశారు. షూటింగ్ ను కూడా కొంత వరకు పూర్తి చేశారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు, పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. కానీ డబ్బు ఇబ్బందుల వల్ల షూటింగ్ కంప్లీట్ కాకముందే పిల్లన గ్రోవి మూవీ ఆగిపోయింది. ఈ చిత్రం వల్ల శివ శక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ చాలానే నష్టపోయారు. ఇకపోతే పిల్లన గ్రోవి కోసం రాజమౌళి ఫస్ట్ టైమ్ ముఖానికి రంగు వేసుకున్నారు. కృష్ణుడి గెటప్ లో ఉన్న ఆయన ఫోటోను తాజాగా డాక్యుమెంటరీ ఫిల్మ్ లో వేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.