సాధారణంగా సెలబ్రిటీలు ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. పొరపాటున నోరు జారితే మాత్రం ట్రోలర్స్ కు అడ్డంగా దొరికినట్లే. సౌత్ స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ విషయంలో కూడా ఇప్పుడు ఇదే జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తన రాబోయే చిత్రం రఘు తాత మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందిరా గాంధీ కాలం నాటి కథతో సుమన్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
అయితే రఘు తాత ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి డాన్స్ ను తక్కువ చేస్తూ కామెంట్ చేయడం ఇప్పుడు వివాదంగా మారింది. అసలేం జరిగిందంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ తెలుగు మరియు తమిళ స్టార్ హీరోల డాన్సింగ్ టాలెంట్ కు సంబంధించి కీర్తి సురేష్ ను ప్రశ్నలు వేసింది.
హీరో నాని మరియు ధనుష్ లలో మీ ఫేవరెట్ డ్యాన్సర్ ఎవరు అని యాంకర్ ప్రశ్నించగా.. కీర్తి సురేష్ బదులిస్తూ ధనుష్ పేరు చెప్పింది. ధనుష్, అల్లు అర్జున్ లలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరని అడగగా.. అందుకు అల్లు అర్జున్ పేరు చెప్పింది కీర్తి. అల్లు అర్జున్, మహేష్ బాబులలో బెస్ట్ ఎవరు అని అడిగితే.. మళ్లీ అల్లు అర్జున్ పేరే చెప్పింది.
అల్లు అర్జున్, చిరంజీవిలో ఎవరి డ్యాన్స్ అంటే ఇష్టమని అడగగా.. చిరంజీవి అని కీర్తి సురేష్ సమాధానం ఇచ్చింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చివర్లో యాంకర్ చిరంజీవి, దళపతి విజయ్ లలో బెస్ట్ డాన్సర్ ఎవరు అని ప్రశ్నించింది. అందుకు కీర్తి సురేష్ విజయ్ పేరు చెప్పి నోరు జారింది. దీంతో ట్రోలర్స్ మరియు మెగా ఫ్యాన్స్ కీర్తి సురేష్ ను టార్గెట్ చేశారు. చిరంజీవి కన్నా విజయ్ ఎలా బెస్ట్ డ్యాన్సర్ అవుతాడో చెప్పాలంటూ కీర్తిని ట్రోల్ చేస్తున్నారు.