మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం రామయ్య వస్తావయ్యా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో శృతిహాసన్, సమంత హీరోయిన్లుగా నటించారు.
పి.రవిశంకర్, ముఖేష్ రిషి, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, తనికెళ్ల భరణి తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. థమన్ సంగీతం అందించాడు. ఎన్నో అంచనాల నడుమ 2013 అక్టోబర్ 11న విడుదలైన రామయ్య వస్తావయ్యా చిత్రం ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి నిర్మాత దిల్ రాజ్‌కు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.
అయితే తాజాగా ఈ సినిమా పరాజయంపై డైరెక్టర్ హరీష్ శంకర్ ఓపెన్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. రామయ్య వస్తావయ్యా ప్రస్తావన వచ్చింది. ఈ సినిమా ఫలితం తేడా కొట్టడానికి కారణమేంటో హరీష్ శంకర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ.. కెరీర్ మొత్తంలో అత్యంత కష్టపడి చేసిన సినిమా రామయ్యా వస్తావయ్యా. మిరపకాయ్, గబ్బర్ సింగ్ తర్వాత ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న కసితో వర్క్ చేశాను.
కానీ ఆ సినిమాకు సెకండాఫే సమస్య అయింది. ఇంటర్వెల్ లోనే మెయిన్ విలన్ చనిపోతాడు.. అక్కడే సినిమా అయిపోయింది.. ముందే మెయిన్ విలన్ చనిపోవడంతో ఇక చూడ్డానికి ఏముందని ప్రేక్షకులు ఫీలయ్యారు. సెకండాఫ్ కథ, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్ గా ఉండేలా చూసుకోకపోవడం పెద్ద మైనస్. అందుకే రామయ్యా వస్తావయ్యా పోయింది. అందుకు పూర్తి బాధ్యత తనదే అని హరీష్ శంకర్ చెప్పుకొచ్చారు. కాగా, రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ మూవీ ఆగస్టు 15న విడుదల కాబోతోంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.