రేణు దేశాయ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పటి హీరోయిన్ గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితమే. కెరీర్ ఊపందుకుంటున్న తరుణంలో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది. అతనితో సహజీవనం చేసి అకిరా నందన్ కు జన్మనిచ్చింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ దంపతులకు ఆద్య అనే కూతురు జన్మించింది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో పవన్, రేణు మధ్య మనస్పర్ధలు తలెత్తడం, విడాకులు తీసుకోవడం, ఆ వెంటనే పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
అయితే రేణు దేశాయ్ మాత్రం తన ఇద్దరి పిల్లలను చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోయింది. 2018లో రెండో వివాహం చేసుకోవాలని రేణు దేశాయ్ భావించి ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ పెళ్లి వరకు మాత్రం వెళ్లలేదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి కారణమేంటో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ వివరించింది. ఈ క్రమంలోనే తన తల్లిదండ్రుల గురించి కొన్ని సంచలన నిజాలను బయటపెట్టింది.
రేణు దేశాయ్ పెళ్లి తర్వాతే కాదు పెళ్లికి ముందు కూడా ఎన్నో కష్టాలు పడింది. రేణు దేశాయ్ పేరెంట్స్‌కు మొదట ఒక అమ్మాయి పుట్టింది. ఆ తర్వాత అబ్బాయి పుడతాడని వారెంతగానో ఆశపడ్డారు. కానీ రేణు దేశాయ్ జన్మించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. అందువల్ల రేణు దేశాయ్‌ను చాలా హీనంగా చూసేవారట. మా నాన్న నన్ను చూసేందుకు, తాకేందుకు కూడా ఇష్టపడలేదని.. చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయి పుడితే చంపేస్తున్నారు.. మా పేరెంట్స్ చదుకున్నవారు కావడంతో నన్ను చంపకుండా వదిలేశారని రేణు దేశాయ్ వాపోయింది.
కన్న తల్లిదండ్రులు ఉండి కూడా వారి ప్రేమను పొందకపోవడం ఒక నరకం.. ఆ నరాకాన్ని నేను చూశానని.. నా జీవితంలో విడాకుల కంటే పుట్టింటి వారు ఆదరించకపోవడం ఎక్కువ బాధను కలిగించిందని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. అమ్మానాన్న కన్నా మా ఇంట్లో పని మనిషే నన్ను ప్రేమగా చూసుకోనేదని తెలిపింది. నేను పడ్డ నరకం నా పిల్లలు పడకూడదు. అందుకే రెండో పెళ్లి ఆలోచనను విరమించుకున్నాను. నేను ఏదైతే ప్రేమను కోల్పోయానో.. దానికి రెట్టింపు ప్రేమను నా బిడ్డలకు ఇచ్చాను అంటూ రేణు దేశాయ్ తన కష్టాలను బయటపెట్టింది.