సినిమా పరిశ్రమలో ఒక హీరో వదిలేసిన కథను మరొక హీరో పట్టుకోవడం అనేది తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఫిల్మ్ కెరీర్స్ లో కూడా ఇటువంటి పరిస్థితి చోటుచేసుకుంది. 80వ దశకంలో స్టార్ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఓ కథను చిరంజీవికి వినిపించారట. కథ అంతగా నచ్చకపోవడం వల్ల చిరంజీవి సున్నితంగా నో చెప్పారు. ఆ తర్వాత అదే కథను బాలకృష్ణకు నెరేట్ చేయగా.. ఆయనకు బాగా నచ్చి సినిమా చేశారు. కట్ చేస్తే ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
చిరంజీవి రిజెక్ట్ చేసిన కథతో బాలయ్య హిట్ కొట్టిన సినిమా మరేదో కాదు మంగమ్మగారి మనవడు. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలకృష్ణ, సుహాసిని జంటగా నటించారు. భానుమతి రామకృష్ణ, గొల్లపూడి మారుతీరావు, రావి కొండల రావు, టెలిఫోన్ సత్యనారాయణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారతీరాజా ఈ మూవీకి కథ అందించగా.. కేవీ మహదేవన్ స్వరాలు సమకూర్చారు.
భార్గవ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన మంగమ్మగారి మనవడు 1984 సెప్టెంబర్ 7న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. కంటెంట్ పరంగానే కాకుండా మ్యూజికల్‌గానూ ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రంలో దంచవే మేనత్త కూతురా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే బాలకృష్ణ సోలో హీరోగా నటించిన చిత్రాల్లో 100 రోజులు ఆడిన తొలి సినిమాగా మంగమ్మగారి మనవడు రికార్డు క్రియేట్ చేసింది. బాలయ్యను ఇండస్ట్రీలో స్టార్ హీరోగా నిలబెట్టింది.
అంతేకాదు కర్నాటకలో 100 రోజులు మరియు హైదరాబాద్‌లో 565 రోజులు ప్రదర్శితమై.. అప్పట్లో అత్యధిక కాలం రన్ అయిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఇటువంటి మంచి సినిమాకు మిస్ చేసుకున్నందుకు చిరంజీవి ఆ తర్వాత చాలా బాధపడ్డారు. అయితే అదే ఏడాది చిరంజీవికి ఛాలెంజ్ రూపంలో హిట్ పడింది. మంగమ్మ గారి మనవడు మూవీ మిస్ అయినా.. ఛాలెంజ్ మూవీ చిరంజీవి కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.