Movies' ఇంద్ర ' సినిమా విషయంలో పెద్ద ర‌చ్చ‌... చిరు వైపు...

‘ ఇంద్ర ‘ సినిమా విషయంలో పెద్ద ర‌చ్చ‌… చిరు వైపు కుర్చీ త‌న్నింది ఎవ‌రు…?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ను ఒక్కసారిగా మలుపు తిప్పిన సినిమా ఇంద్ర. చిరంజీవి మృగరాజు, డాడీ, మంజునాథ లాంటి వ‌రుస‌ డిజాస్టర్ సినిమాలతో డీలా పడినప్పుడు 2002 జూలై 24న వచ్చిన ఇంద్ర ఆంధ్రదేశ్‌లో ప్రభంజనం క్రియేట్ చేసింది. ఏకంగా 122 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. చిరంజీవిలో తిరుగులేని మాస్ స్టామినాను చాటి చెప్పింది. అప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్‌ల‌కు ఇంద్ర సినిమా పాత్రేసింది. చిన్నికృష్ణ కథ, బి.గోపాల్ దర్శకత్వం… అశ్వినీ ద‌త్‌ నిర్మాణ విలువలు, పరుచూరి బ్రదర్స్ డైలాగులు, మణిశర్మ సంగీతం, చిరంజీవి డ్యాన్సులు, ఫైట్లు సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ గ్లామర్.. ఇలా ప్రతిదీ ఈ సినిమాకు ఎంతో ప్లస్ అయ్యాయి.

అయితే ఇంద్ర సినిమా కథా విషయంలో ఎన్నో కసరత్తులు జరిగాయి. పరుచూరి బ్రదర్స్ రాసిన కొన్ని డైలాగులు సినిమాకు తూటాల్లా పేలాయి. మరీ ముఖ్యంగా షౌక‌త్ ఆలీఖాన్ దగ్గర చిరంజీవి దెబ్బలు తిని వచ్చేముందు.. ఏదైనా డైలాగ్ ఉంటే బాగుంటుందని షూటింగ్ స్పాట్ నుంచే చిరంజీవి పరుచూరి బ్రదర్స్‌కు చెప్పారట. అప్పుడు పుట్టిందే.. తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుని వెళుతున్నాను.. లేదంటే తలలు తీసుకు వెళ్లేవాడిని.. అన్న డైలాగ్.

ఇది ఇలా ఉంటే చిన్నికృష్ణ ఓ సీన్ విషయంలో ఏకంగా చిరంజీవితోనే గొడవపడ్డారట. తులసికోట పెట్టే సీన్ అది. స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత షూటింగ్ పూర్తయింది. సినిమా రెండు రోజుల్లో రిలీజ్ అనగా చిరంజీవి తన ఫ్యాన్స్‌ని.. ఆడవాళ్లను దృష్టిలో పెట్టుకుని ఆ సీన్ తీసేద్దామని చెప్పారట. అయితే పరుచూరి బ్రదర్స్ కథ చిన్నికృష్ణ రాశాడు కదా.. అతడితో కూడా ఒక మాట చెప్పాలి అన్నారట.

అదే మాట చిన్ని కృష్ణతో చెప్తే చిన్ని కృష్ణ కోపంతో ఎడిటింగ్ రూమ్‌లో కూర్చుని కుర్చీని చిరు వైపున‌కు వెనక్కి ఒక తన్నుతన్నాడట. అంటే ఆ సీన్ తీయడం చిన్ని కృష్ణకి ఎంత మాత్రం ఇష్టం లేదు. నిర్మాత అశ్వినీ ద‌త్‌ భార్య కూడా ఆ సీన్ ఉండాలని చిన్ని కృష్ణకు సపోర్ట్ చేశారట. చివరకు అందరు చిన్నకృష్ణ మాటకు ఓటు వేసి ఆ డైలాగ్ ఉంచారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆ సీన్ ఎంత పెద్ద హైలైట్ అయిందో తెలిసిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news