మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు హీరోగా 150 కి పైగా చిత్రాల్లో నటించారు. అందులో హిట్ సినిమాలు ఉన్నాయి.. అలాగే ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి కెరీర్ మొత్తంలో ఒకటి కాదు, రెండు కాదు దాదాపు ఆరేళ్లు షూటింగ్ జరుపుకుని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా.. అంజి. కోడి రామకృష్ణ డైరెక్ట్ చేసిన ఫాంటసీ యాక్షన్ అండ్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది.
ఈ సినిమాలో చిరంజీవి సరసన మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ హీరోయిన్ గా నటించింది. టిన్ను ఆనంద్, భూపీందర్ సింగ్, నాగబాబు, ఎంఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్యమైన పోషించగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఎం. ఎస్. ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై శ్యామ్ ప్రసాద్ రెడ్డి అప్పట్లోనే రూ. 30 కోట్ల బడ్జెట్ తో అంజి సినిమాను నిర్మించారు. 1997లోనే అంజి సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
భారీ గ్రాఫిక్స్ వర్క్ మరియు ఇతరితర కారణాల వల్ల దాదాపు ఆరేళ్లు ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇంటర్వెల్ దృశ్యాలు తీయడానికే సుమారు నెల రోజులు పట్టింది. గ్రాఫిక్స్ పనిని సుమారు ఐదారు దేశాల్లో చేయించారు. ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే.. సినిమా ప్రారంభంలో ఆత్మలింగం కోసం ప్రయత్నించే ఒక మాంత్రికుడు ఉంటాడు. ఈ పాత్ర కోసం ఎల్. వి. ప్రసాద్ ఆసుపత్రి దగ్గర భిక్షాటన చేసే వ్యక్తిని ఎన్నుకున్నారట.
అలాగే సినిమాకు మొదట ఆకాశగంగ అనే టైటిల్ ను పెట్టాలని అనుకున్నారు. కానీ చివరకు చిరంజీవి క్యారెక్టర్ నేమ్ అంజినే టైటిల్ గా ఫిక్స్ చేశారు. ఇక భారీ అంచనాల నడుమ 2004 జనవరి 15న విడుదలైన అంజి మూవీ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. విజువల్ ఎఫెక్ట్స్ మరియు చిరంజీవి నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చినప్పటికీ.. అధిక బడ్జెట్ వల్ల వాణిజ్యపరంగా అంజి పరాజయం పాలైంది. అయితే ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో అంజి జాతీయ పురస్కారం అందుకుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న మొదటి తెలుగు చిత్రంగా రికార్డు సెట్ చేసింది. అదీ కాకుండా రెండు నంది అవార్డులు అందుకోవడంతో పాటు 3డి డిజిటల్ గ్రాఫిక్స్‌తో కూడిన తొలి భారతీయ చిత్రంగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో అంజి చోటు దక్కించుకుంది.